- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగూలీ దారెటు?.. రేపటితో ముగియనున్న పదవీకాలం
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పదవీ కాలం సోమవారం (జులై 27)తో ముగియనుంది. జస్టిస్ లోధా సిఫార్సుల మేరకు 2018లో సుప్రీంకోర్టు బీసీసీఐ రాజ్యాంగానికి ఆరు సవరణలు చేసింది. దీని ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్ర అసోసియేషన్, బీసీసీఐ పదవుల్లో వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ పదవీకాలంలో ఉండకూడదు. ఆరేళ్ల తర్వాత మూడేళ్ల పాటు అన్ని రకాల పదవులకు దూరంగా (కూలింగ్ పీరియడ్) ఉండాలి. గత ఏడాది అక్టోబర్‌లో బీసీసీఐ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా ఇప్పటికే 6 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అధికారికంగా ఆయన ఇప్పుడు కార్యదర్శి కాదు. ఇక గంగూలీ బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడిగా, బీసీసీఐలో కలిపి సోమవారం నాటికి ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో సాంకేతికంగా సోమవారమే ఆయన పదవికి చివరి రోజు. ఇకపై ఆయన అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వీలు లేదు. ఇప్పటికే కార్యదర్శి జై షా అధికార ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బీసీసీఐ తరఫున మీడియా సందేశాలను కోశాధికారి అరుణ్ ధుమాల్ పంపుతున్నారు.
బాల్ సుప్రీంకోర్టులో..
సౌరవ్ గంగూలీ, జై షాల పదవీ కాలం పొడిగించాలని కోరుతూ బీసీసీఐ గత ఏడాది డిసెంబర్‌లో పిటిషన్ వేసింది. కానీ అప్పుడు సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు. బీసీసీఐ మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ కోరగా జులై 22న సీజేఐ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో అగస్టు 17న విచారిస్తామని పేర్కొంది. కాగా, అప్పటి వరకు గంగూలీ, జైషాలు తమ అధికారిక కార్యాకలాపాలకు దూరంగా ఉండాల్సిందే. 2018 ఆగస్టులోనే మాజీ చీఫ్ జస్టిస్ లోధా సిఫార్సు మేరకే బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలు చేశారు. ఇప్పుడు వాటిని రద్దు చేయాలని బీసీసీఐ అడుగుతోంది. దీనికి ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరిస్తుందా అనేది అనుమానమే. మరోవైపు లోధా సంస్కరణలు అమలు చేయలేదని బహిష్కరణ వేటు పడిన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. తన బహిష్కరణను రద్దు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నీ ఆగస్టు 17నే విచారణకు రానున్నాయి. కాగా, వీలుంటే ఈ వారంలోనే తమ పిటిషన్‌పై విచారణ చేయాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది.
ఐసీసీకి వెళ్తాడా..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో కొత్త వ్యక్తిని ఆ పదవికి ఎన్నుకోవాల్సి ఉంది. ఈసీబీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ అధ్యక్షుడి రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, సౌరవ్ గంగూలీ కూడా ఈ పదవికి పోటీ చేస్తారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఐసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఇంకా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించలేదు. ఇటు గంగూలీకానీ, బీసీసీఐ కానీ ఎన్నికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, గంగూలీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు గంగూలీకి మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్, శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర తమ మద్దతు గంగూలీకే అని ప్రకటించారు. గంగూలీ బరిలో దిగితే మద్దతు ఇవ్వడానికి పలు క్రికెట్ బోర్డులు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ, గంగూలీ మాత్రం బీసీసీఐ పదవిలో ఉండటానికే మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ కూడా గంగూలీని 2023 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. బీసీసీఐకి గంగూలీ అవసరం చాలా ఉందని గవాస్కర్ అంటున్నారు. ఏదేమైనా సుప్రీం కోర్టు తీర్పు వస్తే గాని గంగూలీ దారెటో ఒక స్పష్టత రాదు.