సోషల్ డిస్టెన్స్‌పై ఇదేనా చిత్తశుద్ధి !

by Shyam |
సోషల్ డిస్టెన్స్‌పై ఇదేనా చిత్తశుద్ధి !
X

దిశ, మేడ్చల్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్ విధించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకు అధికారులు, పోలీసులు నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ, రాజకీయ నేతలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. బియ్యం, కూరగాయలు అందజేసే క్రమంలో సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను మరిచిపోతున్నారు. నిజంగా పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేయాలనుకుంటే ఏ ఫొటోలు దిగాల్సిన అవసరం ఉండదు. కానీ, ఆర్భాటాల కోసమే, ప్రచారాలు చేసుకుంటున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పేదవారికి సాయం చేయడమనేది గొప్ప విషయం. కానీ, వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం ఏమాత్రం కరెక్టు కాదు. ఓ వైపు అధికారులు, ప్రభుత్వం సామాజిక దూరం పాటించాలని చెబుతుంటే.. ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మేడ్చల్ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నష్టపోయాయి. పంట పరిశీలనకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డి బాధితులను పరామర్శించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, పంటలను పరిశీలించి బాధితులతో మాట్లాడే సమయంలో ప్రజా ప్రతినిధులు వ్యవహరించిన తీరుతో గ్రామస్తులు సైతం విస్తుపోయారు. ఫొటోలు తీస్తున్నారనగానే సామాజిక దూరాన్ని మరిచిపోయి ఒకరికొకరు అత్యంత దగ్గరగా నిలబడి పోజులిచ్చారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధుల వ్యవహారాన్ని గమనించిన ఓ పెద్దాయన తువ్వాల అడ్డం పెట్టుకొని అక్కడ్నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

సరుకుల పంపిణీలోనూ అదే పరిస్థితి

దాతల సాయంతో పేదలు, కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసే సమయంలోనూ చాలామంది సోషల్ డిస్టెన్స్‌ను పాటించడం లేదు. సరుకులు తమ వరకు వస్తాయో రావో అన్న టెన్షన్‌తో కార్మికులు ఎగబడే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు సైతం సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

Tags: social distance, lockdown, corona virus, minister mallareddy

Advertisement

Next Story

Most Viewed