ఆరుగురు సుప్రీం జడ్జీలకు స్వైన్ ఫ్లూ

by Shamantha N |

దిశ, హైదరాబాద్ బ్యూరో: ఆరుగురు జడ్జీలకు స్వైన్ ఫ్లూ సోకింది. స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ విషయాన్ని ఒక కేసు విచారణకు వచ్చిన లాయర్లతో చెప్పారు. అంతకుముందే ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేతో చర్చించారు. ఒక్కసారిగా ఆరుగురు న్యాయమూర్తులకు హెచ్1 ఎన్ 1 వైరస్ సోకడంతో మిగిలిన జడ్జీలకు, న్యాయవాదులకు, సుప్రీంకోర్టుకు వచ్చేవారికి సోకకుండా తగిన నివారణా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో బార్ అసోసియేషన్ హాల్‌లో సమావేశమైన దుష్యంత్ దవే తక్షణం సుప్రీంకోర్టు ఆవరణ మొత్తం శుభ్రంచేసి ఇన్‌ఫెక్షన్‌కు ఆస్కారం లేని విధంగా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం ఉదయంకల్లా ప్రత్యేకంగా ఒక క్లినిక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. న్యాయవాదులకు ఈ వైరస్ సోకకుండా ప్రివెంటివ్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఖరీదైన వ్యాక్సిన్ ఖర్చును భరించలేని న్యాయవాదులకు బార్ అసోసియేషన్ తరఫున రూ. 10 లక్షల మేరకు సమకూర్చనున్నట్లు దవే తెలిపారు.

ఆరుగురు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ సోకడంతో ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఆందోళన వ్యక్తం చేశారు. తగిన చర్యలు తీసుకోడానికి సంబంధిత న్యాయవాదులు, అధికారులతో చర్చించారు. ఈ కారణంగా ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఆయన విచారణ ప్రక్రియ 40 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఉదయం 11.08 గంటలకు కోర్టు హాలులో ఆయన కేసు విచారణను ప్రారంభించారు. స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడిన ఆరుగురు జడ్జీల్లో ఇద్దరు రాజ్యాంగ ధర్మాసనం (కాన్‌స్టిట్యూషన్ బెంచ్)కు చెందినవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును ఈ బెంచ్ విచారిస్తూ ఉంది. ఇందులో ఇద్దరు స్వైన్ ఫ్లూ బారిన పడడంతో ఆ కేసు విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని దుష్యంత్ దవే పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆవరణలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులు హాజరైన విదేశీ ప్రతినిధుల ద్వారా హెచ్ 1 ఎన్ 1 వైరస్ సోకినట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనుమానిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సహా పలువురు న్యాయమూర్తులు ఈ సదస్సులో ప్రసంగించారు. సీనియర్ న్యాయవాదులు సైతం కొద్దిమంది ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆరుగురు న్యాయమూర్తులకు ఈ వైరస్ సోకడంతో సుప్రీంకోర్టులో ఆందోళన మొదలైంది. నలుగురైదుగురు న్యాయవాదులు కలిసినచోటల్లా ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. గతంలో ఎన్నడూ కూడా ఈ తరహాలో అరడజను మంది న్యాయమూర్తులు కేవలం ఒకే వైరస్ బారిన పడి, ఒకేసారి విధులకు హాజరుకాలేనంతటి పరిస్థితి చోటుచేసుకోలేదు.

ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారకుండా ఉండేందుకు వెంటనే నిర్దిష్ట చర్యలకు బార్ అసోసియేషన్ శ్రీకారం చుట్టింది. ఒకవైపు ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో హింసాత్మక చర్యలు చోటుచేసుకుంటున్నందున అటు ఢిల్లీ హైకోర్టులో, ఇటు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ అల్లర్లపై విచారణను కోరుతూ వేర్వేరు పిటిషన్లను దాఖలు చేయడానికి చాలామంది సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో జస్టిస్ చంద్రచూడ్ కేసుల విచారణకు జాప్యం జరగవచ్చంటూ సంకేతమిస్తూనే ఆరుగురు జడ్జీలకు స్వైన్ ఫ్లూ సోకిన విషయాన్ని ఒక కేసు విచారణకు హాజరైన న్యాయవాదులతో కోర్టు హాలులోనే వెల్లడించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సమేతంగా ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్న సమయంలో ఢిల్లీ నగరంలో స్వైన్ ఫ్లూ వీరవిహారం చేస్తుందన్న అంశం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Next Story