- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మట్టి పాటల పూదోట కనకవ్వ
దిశ, వెబ్‌డెస్క్: ఆమె చదువుకోలేదు.. టెక్నాలజీ అసలే తెలియదు. ఆమె 60 ఏళ్ల వయస్కురాలు. కానీ, ఇప్పుడామె సోషల్ మీడియా స్టార్ అయ్యింది. “గుడి లేదు.. గుడి తలుపు లేదులే” అంటూ పాటలు పాడి లక్షలాది మంది జనాలను అభిమానులుగా సంపాదించుకోగలిగింది. ఆమె ఇప్పుడెక్కడికెళ్లినా అందురూ గుర్తుపట్టి ‘‘బాగా పాడినవ్ బాగా పాడినవ్’’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఎవరామె అనుకుంటున్నారా..అదేనండి..మన జానపద గాయకురాలు కనకవ్వ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.
కూలీ కాదు..సింగర్ కనకవ్వ..
సిద్దిపేట జిల్లాలోని బొడిగపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ అంటే చాలామంది గుర్తుపట్టరు. కానీ, సింగర్ కనకవ్వ అంటే చాలు ఇట్టే గుర్తుపడుతారు. ఎందుకంటే ఆమె పాటలు సోషల్ మీడియాలో అంతటి స్థాయిలో వైరల్ అయ్యాయి. తన స్వరంతో ఎంతోమందిని అలరించింది. దీంతో ఆమెకు లక్షలాది మంది అభిమానులయ్యారు. నాలుగంటే నాలుగు పాటలే కనకవ్వ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఆమెకున్న కష్టాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడామె పాటలే లోకంగా సంతోషంగా జీవిస్తోంది.
కోయిల పాటకు తీర్మానమేంది..?
బొడిగపల్లి నివాసి అయిన కనకవ్వ తన గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేది. ఆమెకు బయటి ప్రపంచం అంతగా తెలియదు. కష్టమో, నష్టమో ఉన్న ఊళ్లో ఉంటూ పనులు చేసుకుంటూ ఉండేది. అయితే, ఆమెకు తెలిసిందల్లా పాటలు పాడటం మాత్రమే. వాళ్ల అమ్మ చిన్నప్పుడు నేర్పిన పాటలు ఎప్పుడూ పాడుతూ అలరిస్తూ ఉంటుంది. లేచింది మొదలు నిద్రపోయే వరకూ పాటల లోకంలో విహరిస్తూ పాడుతుండగా అవి చుట్టుప్రక్కల వారు, ఊర్లో వారు విని సంతోషించేవారు. అంతేకాదు ఆమె స్వరాన్ని మెచ్చి మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ఇలా తన జీవనం సాగిపోతున్న సమయంలో ఊరిలో కూలీ పనులు అంతగా దొరకకపోవడంతో గోదావరిఖనికి వెళ్లింది. అక్కడ తన చిన్న కొడుకు వద్ద ఉంటూ పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేది. అప్పుడు కూడా తన పాటలను మరిచిపోలేదు. ఒకరోజు కనకవ్వ పాటలు పాడుతుండగా తన చెల్లి కూతురు వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె పాటలు వైరల్ అయ్యాయి. ‘‘బాగున్నాయి.. బాగున్నాయి’’ అంటూ కనకవ్వను మెచ్చుకుంటూ లైక్స్, కామెంట్లు వచ్చాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఒక స్టూడియోలో జానపద పాటల పోటీలో ఆమె పాల్గొన్నది. ఆమె పాటలు విని ‘‘ఎక్కడైనా కోయిల పాటకు తీర్మానం చేసేటోడుంటడా?..నీకు జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి మాకు లేదు.. నీ పాటకు నిర్ణేతగా నిలబడేంత శక్తి మాకు లేదు.. అవ్వా నీ పాటకు మోకరిల్లి నమస్కరిస్తున్నామంటూ’’ న్యాయనిర్ణేతలు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. ఆ స్టూడియోవారు ఆమె పాడిన పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ వీడియోను కూడా లక్షలాది మంది చూశారు. పోటీలు నిర్వహించినవారే ఆమె చేత సంక్రాంతి, మేడారం జాత పాటలు పాడించి యూట్యూబ్‌లో పెట్టారు. అంతే ఇగ..ఆమె పాటలు వైరల్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఆమె పాటలు వినిపించినాయి. అలా ఆమె ఫేమస్ జానపద సింగరైంది.
పాటలే ప్రాణంగా బతుకుతున్న కనకవ్వ ఇప్పుడు పండ్ల గంపను పక్కకు పారేసింది. ఈమెలాగా మహిళలు తమకు ఎదురయ్యే కష్టాలకు భయపడకుండా తమ ప్రతిభతో రానున్న రోజుల్లో రాణిస్తారని, రాణించాలని ఆశిద్దాం.
Tags: kanakavva, folk singer, social media, famous, women’s day, youtube