‘విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి’.. ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ వర్మ

by Sridhar Babu |
SFI
X

దిశ, నేరేడుచర్ల: కరోనా నేపథ్యంలో విద్యార్థులకు సరైన పద్ధతుల్లో తరగతులు నిర్వహించకుండా పరీక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం అడుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ పేర్కొన్నారు. ఆదివారం సూర్యపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇటీవల కాలంలో వెల్లడించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 51శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, బాగా రాసిన విద్యార్థులకు సైతం తక్కువ మార్కులు వచ్చాయని వారన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.

గతంలో ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల వ్యాల్యుయేషన్ గ్లోబరీనా సంస్థకు అప్పజెప్పడంతో ఆ సంస్థ సరైన పద్ధతిలో పరీక్షా పత్రాలను వ్యాల్యూయేషన్ చేయకపోవడం వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు కూడా ఇంటర్ బోర్డు తప్పిదాలతో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల చావులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయాలని తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల పేపర్లను రీ వెరిఫికేషన్ చేసి మార్కులు యాడ్ చేయాలని విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం యాభై లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.

లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఇంటర్ బోర్డు మరియు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేపు జరిగే రాష్ట్రవ్యాప్త ఇంటర్మీడియట్ విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జానీ పాషా, డివైఎఫ్ఐ నాయకులు యడ్ల సైదులు, సాయి కుమార్, నాగరాజు, ప్రవీణ్, సంతోష్, సాయి తేజ, సాయి కిరణ్, యశ్వంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed