కరోనా సెగ.. మార్కెట్లకు జ్వరం!

by Shyam |
కరోనా సెగ.. మార్కెట్లకు జ్వరం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి. అలికిడి లేకుండా వందకు పైగా దేశాల్లో అలజడి సృష్టిస్తోన్న ఈ వైరస్ అంటే ఇప్పుడు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థలో వణుకుపుడుతోంది. చైనాలో మొదలైన దీని కోరలు అన్ని దేశాలకు పాకి వాణిజ్యం నడ్డి విరగ్గొడుతోంది. సాధారణ పర్యాటకుల నుంచి దేశాల అధ్యక్షుల పర్యటనల వరకూ ఎవరూ ఇల్లు దాటి కదిలే పరిస్థితి లేకుండా చేసింది. సరఫరా లేక మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. గత వారం అగాథంలోకి పడిపోయిన్న సూచీలు ఈ వారం మరింత లోతుకు కృంగిపోయాయి. ఉదయం 11.30 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,551 పాయింట్లను కోల్పోయి 33,146 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 747.35 పాయింట్ల భారీ నష్టంతో 9,711 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ ఏకంగా 10,000 మార్కు కంటే కిందకు దిగజారింది. సెన్సెక్స్ 33,200 కిందకు పడిపోయింది. ఇండెక్స్‌లోని సూచీలన్నీ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశీయంగా ఇది మార్కెట్లకు రికార్డు స్థాయి పతనం కావడం గమనార్హం. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 38 నెలల కనిష్ఠానికి పడిపోగా, నిఫ్టీ బ్యాంక్ 17 నెలల కనిష్ఠానికి దిగజారింది.

కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మహమ్మారిగా ప్రకటించడంతో దేశీయ మార్కెట్లు రాత్రికి రాత్రి నీరసించిపోయి ఉదయం ప్రారంభమే భారీగా కుదేలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఇప్పటికే వంద దేశాలకు విస్తరించిన ఈ వైరస్ దెబ్బకు కొన్ని దేశాలు స్వీయ నిర్భంధానికి పూనుకున్నాయి. ఇటలీ ప్రభుత్వం ఏకంగా దేశాన్ని డార్క్ సెల్ లాగా నిర్భంధించుకుంది. చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. విదేశీ ప్రయాణాలు చేయకుండా ప్రజలను నిలిపేస్తున్నాయి. వీటిన్నిటి వల్ల ప్రధానంగా దేశాల ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా వరకు తగ్గిన సరఫరా కారణంగా మార్కెట్లలో ఆందోళన పెరిగి మదుపర్లు అమ్మకాలకు సిద్ధమయ్యారు.

చమురు యుద్ధం:

ఇటీవల చమురు ఉత్పత్తి విషయంలో సౌదీ, రష్యా దేశాల మధ్య మొదలైన చమురు యుద్ధం ఇంకా రాజుకుంటూనే ఉంది. చమురు ఉత్పత్తిని ఇంకా పెంచుతామని ఆరామ్‌కో బుధవారం ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా చమురు శుద్ధి పరిశ్రమల షేర్లు భారీగా కుదేలయ్యాయి. బుధవారం ఒక్కరోజే చమురు ధరలు ఏకంగా 6 శాతానికి పైగా పడిపోయాయి. దేశీయంగా చమురు శుద్ధి పరిశ్రమల్లో అత్యధిక వాటా ఉన్న రిలయన్స్ షేర్ 5 శాతానికి పైగా కృంగిపోయింది. మిగిలిన అన్ని సూచీలకంటే రిలయన్స్ సూచీ అత్యంత ప్రధానమైన షేర్ అవ్వడంతో మార్కెట్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. రిలయన్స్‌తో పాటు మరో సంస్థ ఓఎన్‌జీసీ షేర్ కూడా 8 శాతం కంటే అధికంగా నష్టాన్ని మూటగట్టుకుంది. చమురు ధరలు తగ్గే కొద్దీ ఆయా కంపెనీల లాభాలు ఆవిరయ్యే పరిస్థితి ఉండటంతో మదుపర్లు భారీగా అమ్మకాలకు సిద్ధమయ్యారు.

రూపాయి..రూపాయి:

మార్కెట్ల ప్రభావంతో రూపాయి మారకం విలువ దారుణమైన స్థితిలోకి పడిపోయింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 80 పైసలకు పైగా తగ్గి రూ. 74.50 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో కరోనా ప్రభావం కారణంగా వాణిజ్యం భారీగా తగ్గిపోతూండటంతో కరెన్సీ విలువ కూడా భారీగా క్షీణిస్తోంది.

అమెరికా..చైనాల పరిస్థితి:

మిగిలిన దేశాల మార్కెట్ల కంటే యూఎస్ మార్కెట్లు కాస్త పర్లేదనేలా ఉన్నాయి. బుధవారం జరిగిన ట్రేడింగ్‌లో డొజోన్స్ 5.8 శాతం క్షీణించి 1,464 పాయింట్లను కోల్పోయింది. నాస్‌దాక్ 4.7 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీలు నాలుగు శాతం కంటే ఎక్కువగా దిగజారాయి. ఇప్పటికే కరోనాను అరికట్టేందుకు అమెరికా చర్యలను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూరప్ పర్యటనను రద్దు చేసుకోవడంతో మార్కెట్లలో మరింత ఆందోళన పెరిగింది. కరోనా వ్యాప్తితో చైనా వాణిజ్యం భారీగా తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా యూరప్‌తో వాణిజ్య సంబంధాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున యూరప్ మార్కెట్లలోని పెట్టుబడిదారుల్లో భయం రెట్టింపైంది. వీటి ప్రభావంతో ఆసియా మార్కెట్లు సైతం భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

బంగారం..బేజారు!

సాధారణంగా మార్కెట్లు పతనమయ్యే సమయంలో మదుపర్లు ప్రత్యామ్నాయంగా బంగారం, చమురు వంటి కమొడిటీల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, కరోనా వల్ల ఈ రెండూ కూడా పతనంవైపుకే దిగజారుతుండటంతో మదుపర్లకు వేరే మార్గం లేకుండా అయిపోయింది. అయితే, భవిష్యత్తులో బంగారం, చమురు ధరలు మళ్లీ పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Tags : Sensex, Nifty, US Markets, Coronavirus Fears, Stock Market, BSE, NSE, Share, Stock, Indian Rupee, Brent Crude, US Dollar, Crude Oil Prices, Federal Reserve, Asian Markets

Advertisement

Next Story