తిరిగి లాభాల బాట పట్టిన మార్కెట్లు!

by Harish |
తిరిగి లాభాల బాట పట్టిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను దక్కించుకున్నాయి. సోమవారం భారీ నష్టాల తర్వాత ఐటీ రంగం మద్దతుతో సూచీలు బౌన్స్‌ బ్యాక్ అయ్యాయి. యూరప్ దేశాల్లో కరోనా కొత్త రూపంలో వ్యాపిస్తున్న కథనాలతో కుదేలైన మార్కెట్లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని కనబరించింది. రోజంతా ఆటుపోట్ల మధ్య ప్రతికూలంగా ర్యాలీ చేసినప్పటికీ చివరలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు కోలుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం నాటి లాభాల స్వీకరణ తర్వాత కొనుగోళ్లు జరపడంతో సూచీలు తిరిగి లాభాలను దక్కించుకున్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 452.73 పాయింట్లు ఎగసి 46,006 వద్ద ముగియగా, నిఫ్టీ 137.90 పాయింట్లు లాభపడి 13,466 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా లాంటి హెవీవెయిట్ షేర్ల లాభాలతో ఈ రంగం అత్యధికంగా 3 శాతానికిపైగా బలపడింది. అలాగే, ఫార్మా, బ్యాంకింగ్, మెటల్, ఆటో రంగాలు సానుకూలంగా ర్యాలీ చేశాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టాలను చూడగా, మిగిలిన అన్ని షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, ఎల్అండ్‌టీ, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.84 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed