అమ్మకాలతో దెబ్బతిన్న ఈక్విటీ మార్కెట్లు 

by Harish |
అమ్మకాలతో దెబ్బతిన్న ఈక్విటీ మార్కెట్లు 
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు మళ్లీ నష్టాల నీడ తప్పలేదు. సోమవారం నాటి మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఉదయం ప్రారంభం నుంచే మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో సూచీలు పతనమయ్యాయి. గత వారాంతం నమోదైన లాభాలు సోమవారం నాటి ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ ధాటికి మాయమయ్యాయి.

ముఖ్యంగా ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ మధ్య జరిగిన ఒప్పందంపై సింగపూర్ ఆర్బిట్రేషన్ మధ్యంతర ఉత్తర్వుల స్టే ఇవ్వడంతో రిలయన్స్ షేర్లు దాదాపు 4 శాతం నష్టపోయాయి. దీంతో పాటు అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా భయాలు పెరగడం, ఆ మేరకు ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా మారడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి 40,145 వద్ద ముగియగా, నిఫ్టీ 162.60 పాయింట్ల నష్టంతో 11,767 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మాత్రమే సానుకూలంగా ర్యాలీ చేయగా, మిగిలిన రంగాలన్ని సుమారు 3 శాతం వరకు నీరసించాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, మెటల్, మీడియా రంగాలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎల్అండ్‌టీ షేర్లు లాభపడగా, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, రిలయన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.02 వద్ద ఉంది.

Advertisement

Next Story