మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ కీలక ప్రకటన

by Sridhar Babu |
TS SEC Parthasarathy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలతో పాటు పలు వార్డులు, ఒక డివిజన్‌కు జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సోమవారం ఉదయం పలు అంశాలను వివరించారు. కరోనా నేపథ్యంలో పుర ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై పోలీసులు కూడా నియంత్రణ చేయాలని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే అభ్యర్థులు, పార్టీలతో పాటుగా సంబంధిత ఏరియాలో పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌవ్స్ అందించామని, భౌతికదూరం పాటిస్తూ లెక్కింపు చేస్తున్నట్లు వివరించారు.

ఉదయం 11.30 గంటల వరకు ఎస్‌ఈసీ అధికారిక సమాచారాన్ని వెల్లడించింది. 248 వార్డులకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఖమ్మం కార్పొరేషన్‌లో 1, జడ్చర్లలో 1వార్డును బీజేపీ గెలిచిందని, ఖమ్మంలో సీపీఐ 2, సీపీఎం 1 విజయం సాధించాయన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం 10 స్థానాల్లో గెలిచిందని, ఖమ్మంలో 2, అచ్చంపేటలో 3, జడ్చర్లలో 1, కొత్తూరులో 3, నకిరేకల్​లో 1, ఉండగా.. టీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మంలో 4, అచ్చంపేటలో 3, జడ్చర్లలో 5, కొత్తూరులో 3, నకిరేకల్‌లో 7 వార్డులను కైవసం చేసుకున్నట్లు ప్రకటించారు. నకిరేకల్‌లో స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచినట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. కౌంటింగ్​ప్రక్రియ సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపును ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తున్నట్లు పార్థసారధి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed