కరీంనగర్ సర్పంచ్‌లకు నోటీసుల టెన్షన్

by Sridhar Babu |
కరీంనగర్ సర్పంచ్‌లకు నోటీసుల టెన్షన్
X

దిశ , కరీంనగర్: నూతన పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్‌ల పాలిట శాపంగా మారినట్లయింది. పల్లె ప్రగతిలో పనులు పెండింగ్‌లో ఉన్నా.. మొక్కలను సంరక్షించడంతో నిర్లక్ష్యం వహించినా.. నిధులు దుర్వినియోగం చేసినా కలెక్టర్ నుంచి నోటీసులు వస్తున్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కలెక్టర్ కు చర్యలు తీసుకునే అధికారం ఉండడంతో సర్పంచ్‌లు, కార్యదర్శులు ఎప్పుడు ఎలాంటి తాఖీదులు అందుకోవల్సి వస్తుందోనన్న ఆందోళనతో కాలం వెల్లదీస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 294 మంది సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. పల్లె ప్రగతి తప్పినా హరితహారంలో 85 శాతం మొక్కలు రక్షించకపోయినా, శ్మశాన వాటికల నిర్మాణం జరగకపోయినా వేటు పడకతప్పని పరిస్థితి నెలకొంది. 2018లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం వల్ల గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో సర్పంచులు, ఉద్యోగులు తాఖీదులు అందుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అమలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 165 మంది సర్పంచులు, సిరిసిల్ల జిల్లాలో 123 మంది సర్పంచులు, 8 మంది అధికారులు, పెద్దపల్లి జిల్లాలో ఆరుగురు సర్పంచులకు నోటీసులు జారీ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్‌ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో వివిధ గ్రామాల సర్పంచులు భయం భయంతో పనులు చేయించే పనిలో నిమగ్నం అవుతున్నారు. పారిశుద్ధ్యం నుంచి మొదలు ప్రతి ఒక్క పనికి సర్పంచులే బాధ్యత వహించాల్సి ఉండడంతో జిల్లా కలెక్టర్లు కూడా సర్పంచులపై చర్యలకు పూనుకుంటున్నారు. చక చకా నోటీసులు పంపిస్తూ సర్పంచులపై ఒత్తిడి అధికారులు తీసుకొస్తున్నారు. అయితే ప్రతి పనికి తమతో ముడిపెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు.

Advertisement

Next Story