కరోనా వల్ల వీటికి ఫుల్ గిరాకీ

by Shyam |
కరోనా వల్ల వీటికి ఫుల్ గిరాకీ
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా ప్రభావంతో పల్స్ ఆక్సీమీటర్, ఎలక్ట్రానిక్ బీపీ, మధుమేహ యంత్రాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ప్రతినిత్యం సుమారు రూ కోట్లలో అమ్మకాలు జరుగుతున్నాయంటే ఎంతగా అమ్మకాలు జరుగుతున్నాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు వీటి గురించి ప్రజలలో అంతగా అవగాహన ఉండేది కాదు. బీపీ, షుగర్ లెవల్స్ పెరిగినట్లు అనుమానాలు వస్తే పరీక్షించుకోవడానికి డాక్టర్ల దగ్గరకు పరిగెత్తేవారు. కరోనా ప్రభావం చూపడం మొదలైన నాటి నుండి ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రతి ఒక్కరు భయాందోళనలకు గురవుతున్నారు.

దీంతో బీపీ, షుగర్ వంటి పరీక్షలు ఇంట్లోనే సొంతంగా చేసుకుంటున్నారు. సుమారు ఏడు నెలల క్రితం మొదలైన కరోనా వైరస్ నగర ప్రజలను అభద్రత భావానికి గురి చేసింది. దీనికి తోడు మొదట్లో అనలాగ్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ అందుబాటులో ఉండేది. వీటితో రక్త పోటు ఎంత ఉందనేది తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగానే ఉండేది. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ బీపీ యంత్రాలు అందుబాటులోకి రావడం, వీటితో ఇంటి వద్ద ఉండే పరీక్షలు నిర్వహించుకోవడం సులువుగా మారింది. దీంతో వీటిని కనుగోలు చేసి ఇంటి వద్దనే పరీక్షలు చేసుకుని అవసరమైతే మందులు వాడుతున్నారు. పరిస్థితి విషమంగా మారితేనే డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.

అందుబాటులో ధరలు

మార్కెట్లో పల్స్ ఆక్సీమీటర్, బీపీ, షుగర్ పరీక్షలు సొంతంగా నిర్వహించుకునేందుకు ఎలక్ట్రానిక్ మిషన్లు లభిస్తుండగా వీటి ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. కంపెనీలను బట్టి వీటి ధరలున్నాయి. ఇవి సుమారు రూ 1,500 ల నుండి రూ 2,500 వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. కరోనా ప్రభావం చూపక ముందు కొన్ని పెద్ద మెడికల్ షాప్ లలోనే ఇవి అందుబాటులో ఉండేవి. ఐతే ఇటీవల కాలంలో కరోనా ప్రభావం చూపడం అధికం కావడంతో వీటిని కొనుగోలు చేసే వారు అధికంగా పెరిగిపోయారు. దీంతో ప్రస్తుతం వీటిని అన్ని మెడికల్ షాపులలో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 12 వేల వరకు మెడికల్ షాప్ లు ఉండగా వీటిల్లో ప్రతినిత్యం సుమారు రూ 8 నుండి 10 కోట్ల విలువైన 25 వేల వరకు బీపీ, షుగర్, పల్స్ ఆక్సీమీటర్ల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఇవే కాకుండా ఆన్ లైన్ కొనుగోళ్లు కూడా జరుగుతుండడంతో వీటి అమ్మకాలు ఇటీవల కాలంలో అమాంతం పెరిగిపోయాయి.

పల్స్ ఆక్సీమీటర్ల ను వినియోగిస్తున్న కరోనా రోగులు

కరోనా పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్ లో ఉన్నవారు పల్స్ ఆక్సీమీటర్లను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి ఇష్ట పడని వారు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య చికిత్సలు పొందేంత ఆర్ధిక స్థోమత లేని వారు ఇంటి వద్ద ఉండే డాక్టర్ల సలహాలు పాటిస్తూ కరోనా మందులు వినియోగిస్తున్నారు. ఇలాంటి వారికి రక్తంలో ఆక్సీజన్ శాతం పడిపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.

దీంతో హోం ఐసోలేషన్ లో ఉండే వారు పల్స్ ఆక్సీమీటర్లను కొనుగోలు చేసి వాటి ద్వారా రక్తంలో ఆక్సీజన్ శాతాన్ని స్వయంగా ఎంత ఉందనేది నిర్ధారించుకుంటున్నారు. రక్తంలో 95 శాతం కంటే ఆక్సీజన్ తగ్గి పోతే వెంటనే హాస్పిటల్ కు వెళ్లి వైద్య సహాయం పొందవలసి ఉంటుంది. పల్స్ ఆక్సీమీటర్ సహాయంతో ప్రతి రోజు కనీసం మూడు పర్యాయాలు ఆక్సీజన్ శాతాన్ని నిర్ధారించుకోవలసి ఉండడంతో సొంతంగా కొనుగోలు చేసి ఇంటి వద్దనే పరీక్షలు చేసుకుంటున్నారు. దీంతో ఇటీవల కాలంలో వీటి అమ్మకాలు కూడా ఒక్క సారిగా పెరిగిపోగా కొన్ని సందర్భాలలో వీటి కొరత ఏర్పడిందని మందుల దుకాణాల యజమానులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story