- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూములిచ్చిన వారు బాధపడుతున్నారు.. పట్టించుకునేవారే లేరా..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తమ ప్రాంతంలో బీళ్లు పచ్చని వనాలు మారుతాయనుకున్నారు. తమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని ఆశపడ్డారు. తమ జీవితాల్లో వెలుగు నిండుతాయని సంబురపడ్డారు. తమకు జీవనాధారమైన పంట భూములను ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభుత్వానికి ఇచ్చేశారు. భూములు తీసుకుని మూడేళ్లు గడిచింది. పరిహారం పరిహాసమైంది.. బతుకులు రోడ్డున పడ్డాయి. వ్యవసాయం చేసుకుని నలుగురికి బువ్వ పెట్టినోళ్లు ఇప్పుడు కూలీనాలీ చేసుకుంటూ బతుకులీడుస్తున్నారు. గతంలో ఎస్సారెస్పీకి భూములిచ్చి కొంత నష్టపోతే… ఇప్పుడు సదర్మాట్ ప్రాజెక్టుకు ఉన్న భూములిచ్చి అడుకునే స్థితికి దిగజారిపోయారు. అయినా తమ గోడు వినేవారులేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోస పట్టించుకునేదెవరని అరిగోస పడుతున్నారు మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్వాసితులు.
మామడ మండలం పొన్కల్ సమీపంలో గోదావరి నదిపై సదర్మాట్ బ్యారేజీని నిర్మిస్తున్నారు. దీంతో సుమారు 15వేల ఎకరాల ఆయకట్టుకు ఖానాపూర్ నియోజకవర్గంలో సాగునీరు అందనుంది. 2016 అక్టోబర్ 25న ఈ బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించగా.. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సుమారు 1200 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి, మూలరాంపూర్లో 400ఎకరాలు, నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కమల్కోట్, పొన్కల్, కొత్త టెంబుర్ని, ఆదర్శనగర్ గ్రామాలకు చెందిన 800ఎకరాలు.. సుమారు 748మంది రైతుల భూములు పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఎకరానికి రూ.9.50లక్షల నుంచి రూ.10.40లక్షల వరకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. 2018 మార్చిలో 259మంది రైతులకు రూ.34.26కోట్లు పరిహారం ఇవ్వగా.. మరో 489మంది రైతులకు రూ.45కోట్ల మేర పరిహారం డబ్బు ఇవ్వాల్సి ఉంది.
బడా నేతలకే పరిహారం..
జగిత్యాల జిల్లాలో పూర్తిగా ఒకేసారి పరిహారం చెల్లించగా.. నిర్మల్ జిల్లా మామడ మండలంలో సగం మంది రైతులకు కూడా పరిహారం అందలేదు. మూడేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. మామడ మండలంలో కొందరు పలుకుబడి గల నేతలు, పెద్ద రైతులకు పరిహారం అందగా.. చిన్న, సన్నకారు రైతులకు పరిహారం అందక పడిగాపులు కాస్తున్నారు. భూములు పోయి మూడేళ్లు గడిచినా.. కొందరికే పరిహారం రావడంతో మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోగా.. ఇటీవల మళ్లీ ప్రారంభం కావడంతో బాధిత రైతులు పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని ఆందోళన బాట పట్టారు. మూడేళ్లుగా పరిహారం డబ్బులు రాకపోగా.. భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బులు వచ్చిన వారు భూములు కొనుగోలు చేస్తుండగా.. పరిహారం రాని వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. భూముల ధరలు బాగా పెరగడం.. మూడేళ్లుగా పరిహారం రాకపోవడంతో ఇక తాము భూములు ఎలా కొనాలని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రకాలుగా నిరసన..
మామడ మండలం ఆదర్శనగర్, కొత్త టింబరేణి గ్రామాల రైతులు గతంలో ఎస్సారెస్పీలో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు. అక్కడి నుంచి పొట్ట చేతబట్టుకుని ఇక్కడికి వచ్చి పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా సదర్మాట్ బ్యారేజీలో వారి భూములు పోతుండడంతో.. మరోసారి నిర్వాసితులుగా మారుతున్నారు. ఏళ్లు గడిచినా పరిహారం రాకపోవడంతో బాధితులు తాజాగా ఆందోళన బాట పట్టారు. ఇటీవల పొన్కల్ రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో బాధితులు మంత్రి అల్లోలను అడ్డుకున్నారు. బ్యారేజీ వద్ద పనులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతోపాటు వారం, పది రోజులుగా వివిధ రకాలుగా తమ నిరసన కొనసాగిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టి, మోకాళ్లపై నిల్చోని, వంటావార్పు చేసి, ప్రాజెక్టు నీళ్లలో నిలబడి జలదీక్ష, మండల కేంద్రంలో ర్యాలీ.. ఇలా రకరకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దనే టెంటు వేసి.. రోజుకు 30మంది చొప్పున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాధిత రైతులకు విపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వచ్చి.. తమ సంఘీభావంతో పాటు మద్దతు ప్రకటించాయి.
త్వరలో పరిహారం అందేలా చూస్తాం : మ౦త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం అందేలా చూస్తాం. కరోనా కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. నాబార్డ్ నుంచి రుణం తీసుకుని అయినా పరిహారం ఇస్తాం. మూడు నెలల్లో విడతల వారీగా పరిహారం అందేలా చూస్తాం.