రైతుబంధు చెక్‌లు మిస్.. మాజీ రెవెన్యూ అధికారి చేతివాటం.?

by Shyam |   ( Updated:2021-10-06 04:43:48.0  )
రైతుబంధు చెక్‌లు మిస్.. మాజీ రెవెన్యూ అధికారి చేతివాటం.?
X

దిశ, చండూర్ : రైతులకు పంట పెట్టుబడి సాయం కింద, రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెడితే, కొందరు అధికారులు వారి స్వార్థం కోసం, రైతుబంధు చెక్కులను కాజేశారన్న ఆరోపణలు చండూరు మండలంలో వినపడుతున్నాయి. చండూరు మండలంలోని ధోనిపాముల గ్రామంలో ఒక రైతుబంధు చెక్కు, నేర్మట గ్రామంలోని 6 రైతుబంధు చెక్కులు మిస్సింగ్ అయ్యాయని, 2018లో చండూరు తహసీల్దార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మిస్సింగ్ అయిన రైతుబంధు చెక్కుల విషయంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ రైతుబంధు చెక్కుల విషయంలో విచారణ ఉందని వ్యవసాయ అధికారులను, రెవెన్యూ శాఖ అధికారులను చండూర్ పోలీసులు గుడిపల్లి పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. అక్కడ పోలీసులు వ్యవసాయ అధికారులను కొట్టి, నానా బూతులు తిట్టారని.. వారు నల్గొండ డీఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒకపక్క వ్యవసాయ అధికారులను, మరోపక్క రెవెన్యూ శాఖ అధికారులను కూడా పిలిచి.. కేవలం వ్యవసాయ అధికారులను మాత్రమే ఎందుకు కొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2018లో రైతుబంధు చెక్కుల విషయంలో టీం లీడర్‌గా బాధ్యత వహించిన రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి రైతు పాస్ బుక్కులు, చెక్కులు పంపిణీ చేశారు. పోయిన రైతుబంధు చెక్కుల విషయంలో ఒక వ్యవసాయ అధికారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కేవలం వ్యవసాయ అధికారులను ఎందుకు కొట్టారు..? రెవెన్యూ శాఖ అధికారులను ఎందుకు కొట్టలేదు..? అన్న చర్చ పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ చెక్కుల విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులు.. అప్పుడున్న ఉన్నతాధికారికి రైతుబంధు చెక్కులు ఇచ్చామని, బహిరంగంగానే చెబుతున్నారు.

అప్పటి టీం లీడర్‌గా వ్యవహరించిన, మాజీ రెవెన్యూ శాఖ అధికారికి చెక్కులు ఇచ్చారని, విమర్శలు వినపడుతున్నాయి. మరోపక్క ధోనిపాముల గ్రామానికి చెందిన రైతుబంధు చెక్కు కూడా ఆ ఉన్నతాధికారికే ఇచ్చారన్న వాదన లేకపోలేదు. కానీ అందుకు విరుద్ధంగా, వ్యవసాయ అధికారులపై రైతుబంధు చెక్కులు మోసం చేశారని అనడం సరైంది కాదని, కొంత మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ రైతుబంధు చెక్కుల విషయంలో తప్పు.. వ్యవసాయ అధికారులదా..? రెవెన్యూ శాఖ అధికారులదా..? అన్న కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. అప్పటి మాజీ రెవెన్యూ శాఖ అధికారి.. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై, రైతుబంధు చెక్కులు మోసం చేశారని విమర్శలు వినపడుతున్నాయి.

ఇప్పటికే వ్యవసాయాధికారులను దుర్భాషలాడి, వారిపై చేయిచేసుకున్నందుకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఎస్పీ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. రైతుబంధు చెక్కులు మిస్సింగ్‌ చేసింది ఎవరన్నది త్వరలోనే స్పష్టత రానుంది. గతంలో ఈ రైతుబంధు చెక్కుల విషయంలో నాంపల్లి SBIలో పనిచేసే, ఓ అధికారి.. మాజీ రెవెన్యూ శాఖ అధికారికి సహకరించారన్న ఆరోపణలున్నాయి. మాజీ రెవెన్యూ శాఖ అధికారి తన తెలివితేటలతో ఎవరికీ అనుమానం రాకుండా, వ్యవసాయ అధికారులకు చెక్కులు ఇచ్చినట్లు సంతకాలు తీసుకొని, వారిని ఇరికించారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఓ మాజీ రెవెన్యూ శాఖ అధికారి కొంతమంది పెద్దల అండదండలతో తప్పించుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

స్థానిక ఎమ్మార్వో వివరణ..

రైతుబంధు చెక్కులు మిస్సింగ్‌పై, స్థానిక ఎమ్మార్వో వివరణ కోరగా, 2018లో రైతుబంధు చెక్కులు మిస్సింగ్ అయ్యాయని, స్థానిక పోలీసు స్టేషన్‌లో రిపోర్ట్ చేశాను. 2018లో రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ కలిపి, కొందరు అధికారులకు టీం లీడర్ బాధ్యతను అప్పగించామని తెలిపారు. అసలు ఏం జరిగింది అన్న ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుందని వారు అన్నారు. రైతుబంధు చెక్కుల మిస్సింగ్ విషయంలో విచారణ కొనసాగుతోందని, త్వరలో ఎవరన్నది స్పష్టత రానుందని తెలిపారు.
– చండూరు మండల తహసీల్దార్, మహేందర్ రెడ్డి

మండల వ్యవసాయ అధికారి వివరణ..

మండల వ్యవసాయ అధికారిని ఫోన్‌లో వివరణ అడగగా, రైతుబంధు చెక్కుల విషయంలో మాపై లేనిపోని ఆరోపణలు చేసి, మమ్మల్ని గుడిపల్లి పోలీసులు పిలిచి, నానా బూతులు తిట్టడమే కాకుండా, మాపై చెయిచేసుకున్న ఎస్ఐలను సస్పెండ్ చేసి, 2018లో రైతుబంధు చెక్కుల మిస్సింగ్‌లో దోషులను ప్రభుత్వం త్వరగా బయటపెట్టి, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. రైతుబంధు చెక్కుల విషయంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. రైతుకు పంట సాయం కింద ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెడితే, కొందరు స్వార్ధపరులు నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుబంధు చెక్కుల మిస్సింగ్‌లో న్యాయం జరిపించాలని, మాపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని వారు కోరారు.
-చండూరు మండల వ్యవసాయ అధికారి : మల్లేశం

రెవెన్యూ శాఖ తప్పిదాల వల్లనే, రైతుబంధు చెక్కులు మిస్ అయ్యాయి..

రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉండాల్సిన రైతుబంధు చెక్కులు, రైతు పాస్ బుక్కులు రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉంటాయి. కానీ వ్యవసాయ శాఖ అధికారులే రైతుబంధు చెక్కులు మోసం చేశారని అనడం సరైంది కాదు. రెవెన్యూ శాఖ అధికారులు లేకుండా, నాంపల్లి ఎస్‌బీఐలో రైతుబంధు చెక్కులు ఎలా డ్రా చేశారు. రైతు బంధు చెక్కులు పంపిణీ చేసే సమయంలో పూర్తిగా టీం లీడర్‌గా బాధ్యత తీసుకున్న రెవెన్యూ అధికారులు.. ఇప్పుడు వ్యవసాయ అధికారులపైన నిందలు వేయడం సరైంది కాదన్నారు. రెవెన్యూ శాఖ తప్పిదం వల్లనే ఈ రైతుబంధు చెక్కులు మిస్ అయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు బంధు చెక్కులు మిస్సింగ్ చేసిన వారు ఎవరో త్వరగా తేల్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట పెట్టుబడి కింద ప్రభుత్వ సాయం అందిస్తుంటే, కొందరు అధికారులు వారి స్వార్థం కోసం చెక్కులు మాయం చేయడం విచిత్రంగా ఉందన్నారు.

Advertisement

Next Story