అక్రమ దందాకు అధికార పార్టీ నేతల అండదండలు?

by Sridhar Babu |
అక్రమ దందాకు అధికార పార్టీ నేతల అండదండలు?
X

దిశ, మణుగూరు: నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక అక్రమరవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు బడా లీడర్లు.. తమ అనుచరులను రంగంలోకి దింపి లారీల కొద్దీ ఇసుకను అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. కొన్ని మండలాల్లోని స్థానిక నేతలకు అదే ఆదాయ వనరుగా మారింది. పినపాక నియోజకవర్గంలో టీఎస్ఎండీసీ కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా అధికారులు అడ్డుపడితే నయానో బయానో చెపుతూ తమకున్న పరపతిని ఉపయోగిస్తున్నారు. తమకు అడ్డులేకుండా చూసుకుంటూనే రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపనుల పేరిట జీరో దందాను కొనసాగిస్తున్నారు.

మండల కేంద్రాల్లో జోరుగా ఇసుక దందా..

ఉమ్మడి జిల్లా పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ పథకాలైన రైతువేదికల నిర్మాణాలు, పల్లెప్రకృతి వనాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణాలకు ఈ అనుమతులను మంజూరు చేస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు తవ్వకాలకు అనుమతి ఇస్తున్నారు. ఇది మినహా ఎక్కడ తవ్వకాలకు అధికారులు అనుమతి మంజూరు చేయలేదు. వర్షాలు జోరుగా పడడం, కరోనాతో ఆరు నెలల పాటు భవన నిర్మాణాలు ఆగిపోయి, ఇప్పుడిప్పుడే పుంజుకోవడంతో ఇసుక డిమాండ్‌ భారీగా పెరిగింది. పినపాక నియోజకవర్గ పరిధిలోని బూర్గంపాడు, అమెర్ధ, అమ్మగారిపల్లి, అశ్వాపురం, మణగూరు, చిన్నారావిగూడెం, పినపాక, విజయనగరం, బయ్యారం, గోవిందపురం, జనంపేటలతో పాటు ఇతర మండల కేంద్రాల్లో ఇసుక దందా జోరుగా జరుగుతున్నాయి. వర్షాలు ఉన్న సమయంలో 20 టన్నుల లారీకి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు జరగగా, ప్రస్తుతం పినపాక నియోజక వర్గంలో టీఎస్ఎంఐడీసీ తవ్వకాలు జరుపుతుండడంతో రూ.70,000 వేల వరకు చేస్తున్నారు. ఇవే కాకుండా ట్రాక్టర్‌ ఇసుకను రూ.9 వేల నుంచి రూ.12 వేల మధ్య అమ్మకాలు జరుపుతున్నారు.

నామమాత్రంగానే చర్యలు..

ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ పరీవాహక ప్రాంతలలో ఇసుకకు మాత్రం డిమాండ్‌ బాగా ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని గోదావరి ఇసుక వాగుతో పాటు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ ఇసుకను తరలిస్తున్నారు. కొంత మంది నగర శివార్లతో పాటు మున్సిపాలిటీల శివార్లలో డంపులు పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. ఎవరైనా అధికారులు నిలదీస్తే అభివృద్ధి పనుల పేర్లు చెబుతున్నారు. ట్రాక్టర్‌లు గానీ, లారీలు గానీ పట్టుకుంటే తమకున్న రాజకీయ పలుకుబడినిఉపయోగిస్తున్నారు. నేతలతో ఫోన్లు మాట్లాడిస్తున్నారు. ఎక్కడైనా గ్రామస్తుల నుంచి ఒత్తిళ్లు రావడం ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఉమ్మడి జిల్లా పరిధిలో అక్కడక్కడ ట్రాక్టర్లు, లారీలు సీజ్‌ చేస్తున్నారు. తర్వాత ఫైన్‌లు వేసి వదిలివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, నేతలు అన్ని తామై వ్యవహరిస్తూ ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికారులు మాత్రం ప్రభుత్వ పథకాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని చెబతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం పడుతుందని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుకుతున్నాయి.

Advertisement

Next Story