- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఫైటింగ్‌లో రోబోల సాయం!
అభివృద్ధి చెందిన సాంకేతికత.. కష్టకాలంలో ఉపయోగపడకపోతే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. రోబోటిక్స్ గురించి కూడా ఇలాంటి దుష్ప్రచారమొకటి జరిగేది. అంతేకాకుండా రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయనే తప్పుడు ఆలోచన కూడా ఉండేది. కానీ కరోనా కష్టకాలంలో మేమున్నాం అంటూ రోబోలు నిలబడ్డాయి. అత్యవసర పనులను చేస్తూ మనుషులకు సాయం చేశాయి. మీకోసమే మేము.. అన్నట్లుగా పాటుపడ్డాయి. దాదాపు ప్రతి అత్యవసర సమస్యకు రోబోలు పరిషార్కం చూపించాయి. వాటి కృత్రిమ మేధస్సు, అలసట రాని శారీరక శ్రమతో మానవాళికి సాయంగా ఉంటున్నాయి. దీంతో ఒకప్పుడు రోబోలను తిట్టిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా మలుచుకుని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి రోబోల్లో కొన్నింటిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తమ పనితో అందరి మనసూ దోచుకుంటున్న కొన్ని రోబోల విశేషాలు మీకోసం!
సామాజిక దూరాన్ని గుర్తుచేసే రోబో కుక్క..
కరోనా వైరస్ అనగానే మొదట గుర్తు రావాల్సింది మాస్క్, సామాజిక దూరం. మాస్క్ పెట్టుకోవడం అనేది వ్యక్తిగత విషయం. నువ్వు పెట్టుకోకపోతే నీకే నష్టం. కానీ సామాజిక దూరం విషయంలో అలా కాదు. నువ్వు సామాజిక దూరం పాటించకపోతే సమాజానికి నష్టం. ఈ విషయాన్ని గుర్తుచేయడానికి సింగపూర్‌లో ఒక రోబోను ప్రవేశపెట్టారు. దాని పేరు యెల్లో డాగ్. బోస్టన్ డైనమిక్స్ వారు తయారుచేసిన ఈ రోబో కుక్క తన కెమెరాలు, సెన్సార్లతో సామాజిక దూరం పాటించకుండా నడుస్తున్నవారిని గుర్తించి, వారికి హెచ్చరికలు జారీ చేస్తుంది.
ఫుడ్ డెలివరీకి ఒక రోబో..
లండన్‌లోని కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవారికి ఆహారపదార్థాలు అందించడానికి సరిపడినంత సిబ్బంది లేరు. ఉన్న సిబ్బంది కూడా వైరస్ భయంతో వెళ్లడానికి సంకోచిస్తుంటే రోబోలు సాయంగా నిలిచాయి. మోకాళ్ల వరకు ఎత్తుండే ఆరు చక్రాల రోబోను ఫుడ్ డెలివరీకి ఉపయోగిస్తున్నారు. గంటకు 4 మీటర్ల వేగంతో కదిలే ఈ రోబోను మిల్టన్ కీన్స్ వారు అభివృద్ధి చేశారు.
ఆస్పత్రి శానిటేషన్..
కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోయాయి. వైరస్ భయంతో ఆస్పత్రిలో ప్రతి అంగుళాన్ని శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ మానవమాత్రులకు అది సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాల్సి వస్తుంది. అప్పటికీ అదృష్టం బాలేకపోతే ఆ సిబ్బందికి కూడా వైరస్ అంటుకుంటుందేమోనన్న భయం ఉంటుంది. కానీ రోబోలకు అలసట రాదు, వైరస్ సోకదు. ఎంత పనినైనా, ఏ సమయంలోనైనా చేయగలవు. అందుకే బ్రిటన్‌కు చెందిన డేనిష్ యూవీడీ రోబోట్స్ కంపెనీ వారు శానిటైజేషన్ చేసే రోబోలను రూపొందించారు. ఈ రోబోలు విడుదల చేసే శక్తిమంతమైన అతినీలలోహిత కిరణాలు సూక్ష్మజీవులలో ఉన్న డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను నాశనం చేస్తాయి.
డాక్టర్లకు చేదోడు వాదోడు..
ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే అన్ని కేసులు బయటపడి, వారిని క్వారంటైన్ చేసి వైరస్‌ను నియంత్రించే అవకాశం పొందవచ్చు. కానీ డాక్టర్లు, టెస్టులు చేసే వారు కూడా మనుషులే కదా.. చిన్న జలుబు వచ్చినా కరోనా టెస్టు అని వెళ్తే వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే ముందుగా ఎవరికి టెస్ట్ చేయాలో నిర్ణయించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలను గుర్తించాలి. పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చే అందరికీ ఈ ప్రాథమిక లక్షణాలను గుర్తించే సిబ్బంది ఉండకపోవచ్చు. అందుకే ఇక్కడ కూడా రోబోలు రంగంలోకి దిగాయి. ఐక్యరాజ్యసమితి వారు రువాండాలో ఐదు యాంటీ-ఎపిడెమిక్ రోబోలను ఏర్పాటు చేశారు. వీటిని బెల్జియం దేశానికి చెందిన జోరా బోట్స్ కంపెనీ తయారు చేసింది. ఈ రోబోలు పేషెంట్లను స్క్రీనింగ్ చేస్తాయి. తమ సెన్సార్లతో ఉష్ణోగ్రత చెక్ చేయడం, మాస్క్ లేని వారిని గుర్తించడం, ఇంకా ఇతర కరోనా లక్షణాలను కనిపెట్టడం, సాధారణ ఆరోగ్య సమస్యలకు మందులు ఇవ్వడం వంటి ప్రాథమిక పనులను ఈ రోబోలు చేయగలవు.