చౌరస్తా వెళ్లాలంటే చుట్టూ తిరుగుడే.!

by Anukaran |
చౌరస్తా వెళ్లాలంటే చుట్టూ తిరుగుడే.!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: హ‌న్మకొండ బ‌స్టాండ్ నుంచి అలంకార్ వ‌ర‌కు జ‌రుగుతున్న రోడ్డు నిర్మాణ ప‌నులు ఆరు నెల‌లుగా కొన‌సాగుతూనే ఉన్నాయి. వ‌ర్షాకాలం ఆరంభంలో మొద‌లైన ఈ ప‌నులు నేటికీ పూర్తి కాలేదు. దీంతో న‌గ‌ర ప్రజ‌ల‌తో పాటు వివిధ ప‌నుల నిమిత్తం వ‌చ్చే ప్రయాణికులు న‌ర‌కయాతన అనుభవిస్తున్నారు. బ‌స్టాండ్ నుంచి మచిలీబ‌జార్ మీదుగా చౌర‌స్తాకు చేరుకునే మార్గంలో కంద‌కాల‌ను త‌వ్వి వ‌దిలేశారు. దీంతో ప్రయాణికులు బ‌స్టాండ్ నుంచి విజ‌య టాకీస్ గ‌ల్లీ మీదుగా చౌర‌స్తాకు చేరుకుంటున్నారు. అస‌లే ఇరుకుగా ఉండే ఆ గ‌ల్లీలో వాహ‌నాలతో వెళ్లడం కష్టంగా మారింది. ఈ రోడ్డులో అన్ని ప్రముఖ‌మైన ఆస్పత్రులు ఉండ‌టం కూడా మ‌రో కార‌ణం. కేడీసీకి ఎదురుగా ఉండే రోడ్డు మార్గంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. దీంతో వ‌రంగ‌ల్-హ‌న్మకొండ‌ల‌ను క‌లిపే మార్గం ద్వారానే బ‌స్టాండ్‌కు చేరుకోవాల్సి వ‌స్తోంది. కాజీపేట నుంచి వెళ్లే ప్రయాణికులు వ‌రంగ‌ల్ చేరుకోవాల‌న్నా ఇదే ప‌రిస్థితి. అటు న్యూశాయంపేట ప్రయాణికుల‌కు ఇబ్బందులు త‌ప్పడం లేదు. బ‌స్టాండ్‌కు రావాలంటే గ‌ల్లీల్లో ప‌డి చేరుకోవాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

త్రిన‌గ‌రిలోనే కీల‌క‌ రోడ్డు.. అయినా నిర్లక్ష్యమే

త్రిన‌గ‌రిని క‌లిపే దారుల్లో అత్యంత ముఖ్యమైన కూడలి బ‌స్టాండ్ స‌మీపంలోని మచిలీబ‌జార్ హ‌నుమాన్ ఆల‌య రోడ్డు. కాజీపేట‌, హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్‌ను క‌లుపుతూ ఎంతో కీల‌కంగా ఉండే ఈ రోడ్డు నిర్మాణంపై పాల‌కులు నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార‌, వాణిజ్య కార్యాల‌యాల‌కు, అనేక ఆస్పత్రుల‌కు నెల‌వై, నిత్యం వేలాది మంది జ‌నాలు రాక‌పోక‌లు సాగించే రోడ్డు నిర్మాణం విష‌యంలో ఇంత నిర్లక్ష్యమా..? అంటూ మండిప‌డుతున్నారు. రూ.9 కోట్లతో హ‌న్మకొండ బ‌స్టాండ్ నుంచి వ‌యా మ‌చిలీబ‌జార్‌ అలంకార్ రోడ్డు వ‌ర‌కు రోడ్డు పున‌ర్నిర్మాణ ప‌నులను ప్రభుత్వం గ‌తేడాది జులై‌లో చేప‌ట్టింది. మొద‌ట్లో ప‌నులు వేగంగానే జ‌రిగినా డ్రెయినేజీల నిర్మాణం ప్రతిపాద‌న అంశం తెర‌పైకి రావ‌డం, అందుకు సద‌రు సంస్థ అంగీక‌రించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో ప‌నులు నిలిచి పోయాయి. డ్రెయినేజీల నిర్మాణం ఎలా చేప‌ట్టాల‌నే విష‌యంపై టెండ‌ర్ ప్రక్రియలో నిర్దిష్టంగా పేర్కొన‌క‌ పోవ‌డంతోనే పేచీ న‌డుస్తున్నట్లు తెలుస్తోంది. ల‌క్షలాది మందికి ఎంతో సౌక‌ర్యంగా ఉండే రోడ్డు ఆరు నెల‌లుగా అందుబాటులో లేక‌పోవ‌డంతో ఇబ్బందులు పడుతున్నారు. సుదీర్ఘ కాలంగా ప‌నులు కొన‌సాగించ‌డంపై బీజేపీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed