- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రొమాంటిక్ ' రుషి'
రిషి కపూర్… రొమాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. ముగ్ధ మనోహరమైన రూపం, చక్కని అభినయం దానికి తగిన కొంటెతనం… ఇవన్నీ కలిసిన బాబీగా ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నాడు. రిషి కపూర్ పేరు చెప్తే… మోస్ట్ స్టైలిష్ అండ్ రొమాంటిక్ హీరో అనేస్తుంది ఆ తరం. ఆ స్టైల్, స్వాగ్ తో యూనిక్ యాక్టర్ గా గుర్తింపు పొందిన లెజెండ్ రిషి కపూర్… . 1973 నుంచి 2000 మధ్యలో చేసిన సినిమాల్లో 92 రొమాంటిక్ లీడ్ మూవీస్ చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రిషి ప్రేక్షకులకు ఎలా నచ్చాడు… ఏ విధంగా ఆరాధించారు… ఆయన సినిమాలకు ఎంతగా బ్రహ్మరథం పట్టారని.
మూడేళ్ల వయసులోనే..
రిషి కపూర్… రాజ్ కపూర్, కృష్ణ రాజ్ కపూర్ కొడుకు. 1952 సెప్టెంబర్ 4న జన్మించిన రిషి కపూర్… మూడేళ్ల వయసులోనే సినిమాలో నటించారు. రాజ్ కపూర్ హీరోగా వచ్చిన “శ్రీ 420” సినిమాలో “ప్యార్ హువా ఇకురార్ హువా హై” పాటలో రాజ్ కపూర్, నర్గీస్ వెనుక నడిచే ముగ్గురు పిల్లల్లో చింటు ఒకరు. హీరోయిన్ నర్గీస్ రిషికి చాక్లెట్ ఇచ్చి ఈ పాటలో నటించేందుకు ఒప్పించిందట. ఆ తర్వాత “మేరా నామ్ జోకర్” సినిమాలో నటించిన రిషి… ఈ సినిమాకు ఉత్తమ బాల నటుడుగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఈ సినిమాలో రిషి తన తండ్రి రాజ్ కపూర్ చిన్ననాటి పాత్ర చేశాడు.
హీరోగా ఎంట్రీ…
1973 లో “బాబీ” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రిషి. డింపుల్ కపాడియా హీరోయిన్ కాగా… బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తూ ఆ దశాబ్దంలో బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ మూవీగా రికార్డ్ సాధించింది. కాగా తొలి సినిమాతోనే బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు ఆయన.
బాబీ గురించి…
“బాబీ” సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు రిషి కపూర్. నిజానికి ఈ సినిమా నాన్న నన్ను లాంచ్ చేసేందుకు తీసిందని అంటుంటారు.. కానీ “మేరా నామ్ జోకర్” సినిమా అప్పులు తీర్చేందుకు చేసిందట.. రాజ్ కపూర్ రాజేష్ ఖన్నాతో ఫీల్ గుడ్ టీనేజ్ లవ్ స్టొరీ చేద్దాం అనుకున్నారు కానీ ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేక రిషి కపూర్ ను సెలెక్ట్ చేశారట.
ఆ తర్వాత రఫూ చక్కర్, అమర్ అక్బర్ ఆంటోనీ, ఖేల్ ఖేల్ మే, హమ్ కిసీసే హమ్ నహి, ప్రేమ్ రోగ్, రాజ, లైలా మజ్ను, సర్గం, చాందిని, బోల్ రాధ బోల్, దామిని లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి .. లెజెండరీ యాక్టర్ గా నిలిచాడు. భారత సినీ చరిత్రలో ఒక అధ్యాయాన్ని రచించాడు.
నీతూ సింగ్ తో పెళ్లి
సహనటి నీతూని పెళ్లి చేసుకున్న రిషి కపూర్… భార్యను చాలా ఆనందంగా చూసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరి నిశ్చితార్థం చాలా విచిత్రంగా జరిగిందట. ఢిల్లీలో ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన రిషి… ఆ పెళ్లిలో సోదరి రింగ్ తీసుకుని నీతూకు తొడిగాడట. వీరిద్దరు కలిసేందుకు సోదరి హెల్ప్ చేయగా… చివరగా పెద్దలు ఒప్పుకుని పెళ్లి చేశారట. దాదాపు 15 సినిమాలు కలిసి చేసిన ఇద్దరూ… ఒకరినొకరు అర్ధం చేసుకుని ఏడడుగులు వేశారు. ముందుగా నీతూ అంటే చాలా చులకన భావం ఉండేదని… ఆ తర్వాత ప్రేమగా మారిందని చెప్పాడు రిషి కపూర్. ఆ తర్వాత చాలా మిస్ అయ్యాడట. దీంతో స్పెయిన్ లో ఉన్న రిషి… కభి కభీ షూటింగ్ లో కశ్మీర్ లో ఉన్న నీతుకు గుర్తుకు వస్తున్నావు అంటూ టెలిగ్రాం పంపాడట. ఆ మెసేజ్ సెట్లో ఉన్న అందరూ చదివారని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా…
2000 సంవత్సరం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన రిషి కపూర్… అగ్ని పథ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో గే క్యారెక్టర్ లో కనిపించిన రిషి … దొ దోని చార్ సినిమాలో మిడిల్ ఏజ్డ్ ఫాదర్ గా నటించి భేష్ అనిపించారు. ఈ సినిమాలో కారు కొనేందుకు తపన పడే తండ్రిగా ఆయన నటనకు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు. కపూర్ అండ్ సన్స్ సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు రిషి కపూర్. D- Day సినిమాలో దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ ప్లే చేసిన రిషి కపూర్… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమితాబ్ బచ్చన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.102 నాట్ ఔట్ ద్వారా ప్రేక్షకులకు ఇద్దరూ కలిసి కనువిందు చేశారు.
చివరగా…. పూర్తి కాకుండానే..
రిషి కపూర్ చివరగా “ద బాడీ” సినిమాలో కనిపించారు. ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్పానిష్ ఫిల్మ్ రీమేక్. ప్రస్తుతం హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న షర్మాజి నాంకీ షూటింగ్ దశలో ఉండగానే ఆయన కన్నుమూశారు. దీపికా పదుకునే, రిషి కపూర్ ముఖ్య పాత్రల్లో హాలీవుడ్ మూవీ ద ఇంటర్న్ మూవీ తెరకెక్కించే ప్రయత్న చేయగా… అవి సఫలీకృతం కాకుండానే తుది శ్వాస విడిచారు రిషి కపూర్.
Tags : Rishi Kapoor, Bollywood, Bobby, Chandini, The Body, The Intern