సూర్య ఔట్/నాటౌట్: తెరపైకి సాఫ్ట్ సిగ్నల్ వివాదం

by Anukaran |
సూర్య ఔట్/నాటౌట్: తెరపైకి సాఫ్ట్ సిగ్నల్ వివాదం
X

దిశ, స్పోర్ట్స్ : ‘ఓకే ఓకే.. రాక్ అండ్ రోల్.. సైడ్ యాంగిల్ ప్లీజ్.. వన్‌మోర్ టైమ్.. కెన్ యూ షో ఇట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్… ఒకే ఒకే.. జూమ్ ఇట్. ఈజ్ దట్ ఆల్ యూ హావ్. ఓకే.. ఐ మేడ్ మై డెసిషన్’.. నిన్నటి నుంచి ఈ మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టీ20లో సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. సామ్ కర్రన్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయి బౌండరీ దగ్గర డేవిడ్ మలన్ అందుకున్న అద్బుతమైన క్యాచ్‌కు అవుటయ్యాడు.

అయితే, ఆన్‌ఫీల్డ్ అంపైర్ దాన్ని ‘సాఫ్ట్ సిగ్నల్ ఔట్’గా పరిగణించి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. పలు రీప్లేలు, పలు కోణాల్లో థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ పరిశీంచి అవుట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి గ్రౌండ్‌కు టచ్ అవుతున్నట్లు కనపడుతున్నా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్‌గా నిర్దారించాడు. దీంతో గ్రౌండ్‌లో ఉన్న సూర్యకుమార్‌తో పాటు టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. బంతి నేలను తాకినట్లు అంత స్పష్టంగా కనిపిస్తున్నా.. పదే పదే పలు రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ దాన్ని అవుటనే చెప్పడంతో మరోసారి ‘సాఫ్ట్ సిగ్నల్’ అంశం తెరపైకి వచ్చింది.

అసలు ఏమిటీ సాఫ్ట్ సిగ్నల్?

క్రికెట్‌లో టెక్నాలజీ పెరిగిన తర్వాత రనౌట్లు, ఎల్బీలు, స్టంపింగ్‌ల కోసం టీవీ రీప్లేలు, డీఆర్ఎస్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయితే క్యాచ్‌ల విషయంలో మాత్రం సాఫ్ట్ సిగ్నల్ అనే నిబంధనను వాడుతున్నారు. మిగిలిన అవుట్ల విషయంలో థర్డ్ అంపైర్‌ను నేరుగా సంప్రదించే అవకాశం ఫీల్డ్ అంపైర్లకు, డీఆర్ఎస్ ద్వారా ఆటగాళ్లకు అవకాశం ఉంది. క్యాచ్‌ల విషయంలో మాత్రం అలా నేరుగా సంప్రదించే అవకాశం లేదు. ఫీల్డర్ పట్టిన క్యాచ్ అవుటా కాదా అనే విషయాన్ని ముందుగా ఆన్‌ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ద్వారా టీవీ అంపైర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.

ఫీల్డర్ పట్టిన క్యాచ్‌ను పలు కోణాల్లో చూసిన తర్వాత కూడా థర్డ్ అంపైర్ ఒక నిర్ణయానికి రాలేకపోతే ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాఫ్ట్ సిగ్నల్‌నే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇస్తే ఔట్, నాటౌట్ అయితే నాటౌట్ అన్నమాట. ఆ మాత్రం దానికి టీవీ అంపైర్ ఎందుకు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాగా, ఆన్‌ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ను టీవీ అంపైర్ తిరస్కరించే వీలు కూడా ఉన్నది. కాకపోతే.. అందుకు కచ్చితమైన వీడియో ఆధారాలు ఉండాల్సిందే. గురువారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన బంతిని డేవిడ్ మలన్ నేలకు తాకించాడనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. అందుకే సాఫ్ట్ సిగ్నల్ ఔట్‌నే థర్డ్ అంపైర్ ప్రకటించారు.

మరి రీప్లేలో కనపడింది అబద్దమా?

సూర్యకుమార్ కొట్టిన బంతిని డేవిడ్ మలన్ నేలకు తాకించాడని కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. అయితే అది నిజం కాదని ప్రముఖ వ్యాఖ్యాత, క్రికెట్ విశ్లేషకుడు హర్ష భోగ్లే అంటున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌లో 2డీ కెమేరాలను ఉపయోగిస్తున్నారు. ఈ కెమేరాల ద్వారా మామూలు క్యాచ్‌లు కూడా నేలకు తాకినట్లే కనిపిస్తుంటాయి. ఒక గ్రౌండ్‌లో జరిగే 3డీ ఈవెంట్‌ను 2డీ కెమేరాల ద్వారా చిత్రీకరించడం.. దాని రీప్లే ద్వారా ఔట్లను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యమని హర్ష భోగ్లే అన్నారు. కచ్చితత్వం రావాలంటే 3డీ కెమేరాలు ఉపయోగించాల్సి ఉంటుందని హర్ష చెప్పారు. కానీ 3డీ కెమేరాలు ఉపయోగించాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రస్తుతం హాక్-ఐ ద్వారా డీఆర్ఎస్ టెక్నాలజీ కోసం 3డీ కెమేరాలను ఉపయోగిస్తున్నారు. కేవలం వీటి కోసమే 12 కెమేరాలు ఒక ఫిక్స్‌డ్ స్థానంలో పని చేస్తుంటాయి. మరి గ్రౌండ్‌లో కదిలే 3డీ కెమేరాలు ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చో అర్దం చేసుకోవచ్చు.

ఉండాల్సిందే..?

సూర్యకుమార్ అవుట్ తర్వాత ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనపై ఐసీసీ పునరాలోచించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ డిమాండ్ చేశారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై మండిపడ్డారు. థర్డ్ అంపైర్ అన్ని రీప్లేలు చూసి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ సైమన్ టఫల్ మాత్రం ‘సాఫ్ట్ సిగ్నల్’కు అనుకూలంగా ఓటేశారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో కెమేరాలు కూడా కొన్ని క్యాచ్‌లను కనిపెట్టలేవు. అలాంటి సమయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని కొనసాగించడమే మంచిది. సాఫ్ట్ సిగ్నల్ అనేది డాక్యుమెంటేషన్ కోసం ఇచ్చే నిర్ణయం. కాబట్టి అదే ఫైనల్ అవుతుందని టఫెల్ అంటున్నారు. ఏదేమైనా సూర్యకుమార్ వివాదాస్పద ఔట్ ఇప్పుడు సాఫ్ట్ సిగ్నల్‌పై చర్చకు తెరతీసింది. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story