రెండో విడత రైస్ పంపిణీ ప్రారంభం

by Shyam |
రెండో విడత రైస్ పంపిణీ ప్రారంభం
X

దిశ, హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు రేషను దుకాణాల ద్వారా అందించే రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ శుక్రవారం ప్రారంభమైంది. సిటీ మేయర్ బొంతు రామ్మోహన్, పౌరసరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ శ్రీనగర్ కాలనీలో లాంఛనంగా ప్రారంభించారు. రేషను కార్డులున్న కుటుంబాల్లోని సభ్యులకు తలా 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదు సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ మాసంలో పంపిణీ పూర్తయింది.

రేషను‌కార్డు లేని వలస కూలీలకు తలా 5 కిలోల బియ్యం, తలా రూ.500 నగదు ప్రభుత్వం అందజేస్తోంది. తొలి విడత పంపిణీ 95 శాతం పూర్తయిందని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 9 సర్కిళ్లలో 674 రేషన్ దుకాణాల ద్వారా 5.80 లక్షల కుటుంబాలకు అందించనున్నట్లు తెలిపారు. ఇంతకాలం బియ్యం తీసుకోకపోయినా ఇప్పుడు మాత్రం దాదాపు 95 శాతం మంది ఉచిత బియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి బియ్యం పంపిణీని ప్రారంభించామనీ, నగదునూ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలనుకున్నా మే డే కారణంగా బ్యాంకులకు సెలవు కావడంతో శనివారం జమ అవుతాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 15వ తేదీ వరకు మాత్రమే పంపిణీ జరుగుతున్నందున కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ నెలలో చివరి వారం వరకూ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నెల కూడా అదే విధంగా నెలాఖరు వరకూ ఇస్తామని తెలిపారు. ప్రజలు షాపుల వద్ద గుంపులుగా వచ్చి దుకాణాల వద్ద గుమిగూడొద్దని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పి.పద్మ తెలిపారు.

Tags: rice distribution, pds shops, corona virus, covid 19, lockdown, civil supply dept

Advertisement

Next Story

Most Viewed