గ్రేట్ ధరణి.. అధికారులు సమాధానం చెప్పండి.. తప్పెవరిది..?

by Anukaran |   ( Updated:2021-06-17 20:53:16.0  )
Dharani Portal
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి పోర్టల్’ మంచికొచ్చిందో చెడుకొచ్చిందో అర్థం కాని దుస్థితి నెలకొంది. కేవలం క్రయ విక్రయాలకు మినహా మరేఇతర మేలైన సేవలందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ రెవెన్యూ కార్యాలయం ముందు ఓ గంట నిలబడినా పదుల సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో వేదన.. నరకయాతన. తమ జీవితాలతో ముడిపడిన భూమిపై హక్కులు లేకుండా చేశారని కొందరు, అన్ని హక్కులు ఉన్నా అమ్ముకోవడానికి వీల్లేకుండా చేశారని ఇంకొందరు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఏ రోజైనా దరఖాస్తుదారుడు రాని తహసీల్దార్​కార్యాలయం లేదంటే ఆశ్చర్యం కలుగుతోంది. ప్రతి కార్యాలయం చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పేర్లు తప్పులు పడ్డాయని, విస్తీర్ణం తక్కువ పడిందని, సర్వే నంబర్లు మిస్​చేశారని, మా భూమిపై ఎలాంటి వివాదాలు లేకపోయినా కేసులు ఉన్నట్లు రాశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తాము అనుభవిస్తోన్న భూములపై వివాదాలు సృష్టించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. భూముల విలువ పెరగడంతో రికార్డుల్లో ఏం జరిగినా మా ప్రాణాల మీదికి వస్తుంది.. అంటూ నెలల తరబడి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పట్టాదారులు ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు.

తాము చేయని తప్పుకు కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలి? మేం చేసిన తప్పేంటి? మా రికార్డులేమైనా తప్పా? అధికారులు చేసిన తప్పులను సరి చేసేందుకు మేమెందుకు దరఖాస్తు చేసుకోవాలి? తప్పులు ఎవరు చేశారు? శిక్ష ఎవరికి వేస్తున్నారు? అంటూ దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. పట్టా భూములను రికార్డులను పరిశీలించకుండా గంపగుత్తగా లావాదేవీలకు అవకాశాలు లేకుండా నిషేదం విధిస్తూ డేటాను లాక్​చేసిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల్లోని సర్వే నంబర్లలో కొన్నింటిని మిస్​చేసిన రెవెన్యూ సిబ్బంది ఎవరు? విస్తీర్ణం ఎంతనేది కూడా కరెక్టుగా రాయకుండా పొరపాట్లు చేసిన నేరస్థులు ఎవరు? వీటన్నింటిపై సమగ్ర విచారణ చేయాలని రైతులు డిమాండ్​చేస్తున్నారు. లక్షలాది మంది రైతులు పలు రకాల సమస్యలతో ఆందోళనలో ఉన్నారు. వీటికి కారకులెవరో దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయవాదులు, రెవెన్యూ చట్టాల నిపుణులు డిమాండ్​చేస్తున్నారు.

రైతు తప్పు చేశాడా?

రెవెన్యూ రికార్డుల్లో తప్పులు రాసింది రైతులేనా/హక్కుదారులెనా? మరి ఎవరు వివరాలను ఉద్దేశ్యపూర్వకంగా మార్చిందెవరు? గతంలోని ఆర్వోఆర్ రికార్డులను ఏమార్చి డేటాను ఇష్టారాజ్యంగా ధరణి పోర్టల్‌లోకి అప్‌లోడ్​చేయడం ద్వారా తలెత్తిన సమస్యలకు రైతులు ఎందుకు ఇబ్బంది పడాలో అధికారులు చెప్పాలి. మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత నెలల తరబడి తహశీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ తిరగాలి. తాము తప్పు చేయనప్పుడు శిక్ష ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏ అధికారి, ఏ ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించారో.. వారిని శిక్షించాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలని యాదాద్రి జిల్లా సంస్థాన్​నారాయణపురం మండలానికి చెందిన పలువురు డిమాండ్​చేస్తున్నారు.

పట్టా భూములను, అసైన్డ్​భూములని రాశారు. అసైన్డ్​భూములను అటవీ భూములని రాశారు. పట్టా భూములు నాలా కన్వర్షన్​కాకముందే వ్యవసాయేతర భూములుగా మార్కెట్​విలువలు మార్చి రాశారు. నాలా కనర్షన్​చేయకపోయినా మూడేండ్ల నుంచి ముప్పు తిప్పలు పెడుతున్నారు. పొరపాటు జరిగిందని తహసీల్దార్​లిఖితపూర్వకంగా రాసిచ్చినా స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్​శాఖ అధికారులు మార్చరు. ఇంకెన్నాండ్లు కలెక్టరేట్​చుట్టూ తిరగాలంటూ రైతులు మండిపడుతున్నారు. ఎవరో చేసిన తప్పులకు తమను బలి పశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పిదాలను సవరించేందుకు హక్కుదారులు, రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంలో ఆంతర్యమేమిటో ప్రగతి భవన్‌లో రెవెన్యూ అంశాలు చూసే సీనియర్​ఐఏఎస్ అధికారులు, సీసీఎల్ఏ అధికారులు చెప్పాలని రెవెన్యూ చట్టాల నిపుణులు డిమాండ్​చేస్తున్నారు.

తీర్పు కావాలట..!

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ఓ సర్వే నంబరులో వందలాది ఎకరాల పట్టా భూమి ఉంది. వందలాది మంది పట్టాదారులు ఉన్నారు. వీరిలో ఎవరిపైనో ఒకరు కేసు వేశారు. ఇంకేముంది? మొత్తం ఆ వందలాది ఎకరాల భూమిని ఎలాంటి క్రయ విక్రయాలు జరపొద్దంటూ రెవెన్యూ అధికారులు లాక్​వేసి కూర్చున్నారు. ప్రొహిబిటెడ్​ప్రాపర్టీస్​ఇన్​రూరల్​ప్రొహిబిటెడ్​రిజిస్టర్​అంటూ రైతులెవరికీ అర్థం కాని భాషలో రాశారు. మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవడానికి సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు.

ఎవరు కేసు పెట్టారు? ఎక్కడ పెట్టారు? తీర్పు కాపీ ఉందా? ఐతే అప్ లోడ్​చేయండి? అంటూ షరతులు కనిపిస్తున్నాయి. వందలాది మంది రైతుల్లో ఎవరో ఒకరు కేసు దాఖలు చేస్తే మిగతా వారికి ఏం సంబంధం? మిగతా భూమిపై కేసు ఉన్నట్లు ధరణి పోర్టల్‌లో చూపించడమెందుకు? మిగతా రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసుల వివరాలు రైతులు ఎందుకు తీసుకురావాలి? అది సాధ్యమయ్యే పనేనా? అని అధికారులను నిలదీస్తున్నారు. ఏ సర్వే, సబ్​డివిజన్​పై కేసు ఉన్నదో అంత వరకు లాక్ చేయకుండా మొత్తానికి ఎసరు పెట్టడంలో ఆంతర్యమేమిటో అధికారులు చెప్పాలంటున్నారు.

వీళ్లకేం చెప్తారు?

‘బడంగ్​పేట కార్పొరేషన్​అల్మాస్​గూడకు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబానికి కందుకూరు మండలంలో మూడెకరాల భూమి ఉంది. వారికి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి పెళ్లి కుదిరింది. మూడెకరాలను బేరానికి పెట్టారు. లాక్‌డౌన్‌కు ముందు అన్ని డాక్యుమెంట్లు చూసుకున్న ఓ రియల్టర్​కొనేందుకు ముందుకొచ్చాడు. అడ్వాన్స్​ఇచ్చి అగ్రిమెంటు కుదుర్చుకున్నాడు. ఇంకేముంది? డబ్బులు వస్తాయని భావించిన పట్టాదారుడు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాడు. తీరా గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్​కోసం స్లాట్​బుక్​చేసేందుకు ప్రయత్నించగా సక్సెస్​కావడం లేదు. ఎంక్వయిరీ చేస్తే సదరు భూమిపై కేసు ఉందని గ్రేట్​ధరణి పోర్టల్​సమాధానమిస్తోంది. ఇప్పుడేం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. తనకు రిజిస్ట్రేషన్​చేస్తేనే డబ్బులు ఇస్తానని రియల్టర్ చెబుతున్నాడు. పెళ్లి ముహూర్తం దగ్గరికొస్తుందని ఆ కుటుంబం దగ్గర డబ్బులు లేక పడుతోన్న ఇబ్బంది అంతా ఇంతా కాదు.. ఇప్పుడీ కుటుంబం చేసుకున్న పాపమేమిటో రెవెన్యూ ఉన్నతాధికారులే చెప్పాలి?’’..

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒకరు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆసుపత్రి ఖర్చుల కోసం తన భూమిని అమ్మకానికి పెట్టారు. కానీ పట్టాదారు పాసు పుస్తకంలోని విస్తీర్ణానికి, ధరణిలో నమోదు చేసిన విస్తీర్ణానికి మధ్య తేడా ఉంది. ఓ సర్వే నంబరు మిస్​చేశారు. ధరణి పోర్టల్​మాడ్యూల్​ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. నెలలు గడిచింది. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాడు. ఈ క్రమంలోనే వాట్సాప్​లో మీ సమస్యను చెప్పినా వెంటనే పరిష్కరిస్తామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. మళ్లీ ఆశలు రేకెత్తాయి. వెంటనే అన్ని ఆధారాలతో వాట్సాప్‌‌లో వేడుకున్నాడు. మూడు రోజుల తర్వాత మీరు మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలంటూ మెసేజ్​ఇచ్చారు. అప్పటికే మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోగా పని కాలేదనే వాట్సాప్‌లో ఫిర్యాదు చేసిన అతడికి ఏం చేయాలో తెలియక విస్మయానికి గురయ్యాడు. అప్పులు తీర్చేందుకు ఇప్పుడేం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. ఇతను చేసిన తప్పేమిటో రెవెన్యూ అధికారులు చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed