ధరణి వెరీ స్లో..!

by Shyam |
ధరణి వెరీ స్లో..!
X

దసరా నుంచి కచ్చితంగా ప్రారంభిస్తామని చెప్తున్న ధరణి పోర్టల్ ఆదిలోనే ఆటంక పరుస్తోంది.. ప్రాక్టికల్ అనుభవం కోసం ఆదివారం సైట్ ఓపెన్ చేసిన అధికారులకు చేదు అనుభవమెదురైంది.. మొదట్లోనే నెట్వర్క్ ప్రాబ్లం, సర్వర్ డౌన్ వంటి సమస్యలు ఎదురయ్యాయి.. ఒక్క డాక్యుమెంట్ కూడా అప్ లోడ్ చేయాలేదని, ఇలా ఉంటే పదుల సంఖ్యలో లావాదేవీలు ఎలా చేస్తామంటూ రెవెన్యూ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఈ పోర్టల్ వల్ల జనం తిట్లకు మళ్లీ బలి కావడం ఖాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. సైట్ ను 100 శాతం పర్ఫెక్ట్ గా రూపొందించలేదని, ‘ధరణి.. వెరీ స్లో’ అంటూ.. ఇదో ‘సమస్యల పుట్ట’ అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన పోర్టల్ ధరణి. దసరా నాడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నెల 25 నుంచి జనానికి అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యంత పారదర్శకత కలిగిన ధరణిని వినియోగించి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఎలా చేయాలో వివరించారు. మ్యాపులతో ఈ ప్రక్రియల సోపానాలను చెప్పారు. ఆదివారం నుంచి ప్రాక్టికల్ గా కనీసం పది లావాదేవీలు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ సెలవు రోజు కూడా అందరూ కార్యాలయానికి వెళ్లారు. పోర్టల్ ను ఓపెన్ చేసి ప్రాక్టికల్ అనుభవం కోసం ప్రయత్నించారు.

కానీ ఆ వెబ్ సైట్ సమస్యల పుట్టగా ఉందని తేలింది. నెట్వర్క్ సమస్యలు, సర్వర్ డౌన్ వంటివి ఎదుర్కొన్నారు. శనివారం నాడే స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత స్వీయ అనుభవంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రెవెన్యూ అధికారుల నోట నెట్వర్క్ సమస్య తీవ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. రోజంతా కూర్చొని చేస్తాం.. కానీ ఈ నెట్వర్క్ సమస్యలు ఉంటే ఎలా అధిగమిస్తామని ప్రశ్నించారు. మున్ముందు కూడా సైట్ ఇట్లాగే ఉంటే జనం తిట్లకు మనం మళ్లీ బలి కావడం ఖాయమని రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్ వేర్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఆదివారం కూడా ఇంట్లో ఉండనివ్వకుండా శిక్షణ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు ఉద్యోగులు మండిపడ్డారు. తొలి రోజుల్లోనే వెబ్ సైట్ తో తంటాలు పడాల్సి వస్తోందని పలువురు వాపోయారు.

లాగిన్ నుంచే సమస్యలు..

ధరణి పోర్టల్ లో తహసీల్దార్ లాగిన్ కావడం నుంచే సమస్యలు కనిపించాయి. సైట్ చాలా స్లో గా ఉందని స్పష్టమైంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒక్క డాక్యుమెంట్ కూడా అప్ లోడ్ చేయలేకపోయినట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఒకే రోజు ఓ పది డాక్యుమెంట్లు వస్తే పని ఎలా ముందుకు సాగుతుందన్న ప్రశ్న తలెత్తింది. కొనుగోలుదార్లు, అమ్మకందార్ల నుంచి బయోమెట్రిక్ ను క్యాప్చర్ చేసిన తర్వాత తహసీల్దార్ కు పంపారు. ఆ తర్వాత తహసీల్దార్ అప్రూవ్ చేశారు. కానీ రివర్స్ ఎండార్స్మెంట్ ప్రింటింగ్ రావడం లేదు. యూజర్ ఫ్రెండ్లీగా లేదు. డమ్మీ నంబర్లతో శిక్షణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడే ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటే మున్ముందు ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందోనన్న సందేహం వ్యక్తమవుతోందని రెవెన్యూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

100శాతం పర్ఫెక్ట్ కాదు..

ధరణి పోర్టల్ ను 100 శాతం పర్ఫెక్ట్ గా రూపొందించలేదు. ఇంకా సాంకేతిక సమస్యలు ఉన్నట్లు రెవెన్యూ ఉద్యోగులు గుర్తించారు. పూర్తి స్థాయిలో తయారు చేయకుండానే పబ్లిక్ డొమెయిన్ లో పెట్టడం, దీని ద్వారా డాక్యుమెంట్లు, మ్యుటేషన్ చేయడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. 144 మంది సబ్ రిజిస్ట్రార్లు ఉన్నప్పుడే సర్వర్ ప్రాబ్లెమ్ చాలా ఉండేది. ఇంకా 570 తహసీల్దార్లు, 144 మంది సబ్ రిజిస్ట్రార్లు ఒకే పోర్టల్ మీదనే పని చేస్తే ఆ సర్వర్ పని ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చేస్తేనే ధరణి పోర్టల్ ను ప్రజలు విశ్వసిస్తారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Next Story