Maoists: మావోయిస్టులకు మరో షాక్.. ఆ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్

by vinod kumar |
Maoists: మావోయిస్టులకు మరో షాక్.. ఆ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మావోయిస్టుల (Maoists)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని బొకారో (Bokaro) జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సలైట్లు హతమయ్యారు. జిల్లాలోని లుగు ఝుమ్రా కొండల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య సుమారు రెండున్నర గంటల పాటు ఎదురు కాల్పులు జరగగా 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, ఎస్ఎల్ఆర్ గన్, భారీగా ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు.

మరణించిన వారిలో అగ్రనేతలు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్, అరవింద్ యాదవ్ అలియాస్ అవినాష్, జోనల్ కమిటీ సభ్యుడు సాహెబ్రామ్ మాంఝీలు ఉన్నారు. వీరిలో వివేక్‌పై రూ.కోటి, అరవింద్ పై రూ.25 లక్షలు, సాహెబ్రామ్ పై రూ.10 లక్షల రివార్డు ఉంది. వారిపై అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మిగిలిన వారిని మహేశ్ మాంఝీ అలియాస్ మోటా, తాలు, రాజు మాంఝీ, గంగారాంలుగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారని, రాబోయే 15 నుంచి 20 రోజుల్లో అన్ని మావోయిస్టు దళాలను నిర్మూలించడమే తమ లక్ష్యమని డీజీపీ వెల్లడించారు. మరోవైపు నక్సలైట్లను హతమార్చిన భద్రతా బలగాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అభినందనలు తెలిపారు.



Next Story

Most Viewed