ఎస్టీల రిజర్వేషన్లు కొనసాగాలి : సీఎం కేసీఆర్

by Shyam |
ఎస్టీల రిజర్వేషన్లు కొనసాగాలి : సీఎం కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: గిరిజనులకు, ఆదివాసీలకు భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని కాపాడే విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుపై మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ పోస్టుల భర్తీలో వందశాతం రిజర్వేషన్‌ను స్థానిక గిరిజనులకే కల్పిస్తూ 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో (నెం.3) ఇచ్చిందని, దీన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిందని, ఆదివాసీ హక్కులకు ఇది భంగకరమైనందున మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను అధ్యయనం చేయాలని తెలిపారు. గిరిజన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌లో సీఎంతో భేటీ అయ్యి సుప్రీం తీర్పుతో అన్యాయం జరుగుతుందని వివరించిన నేపథ్యంలో సీఎం పై విధంగా స్పందించారు.

టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసి సుప్రీంకోర్టు ఇటీవల కొట్టేసిన పిటీషన్‌ గురించి వివరించారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలులో పేర్కొన్న విధంగా స్థానికులకు అదే ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించే విషయంలో వందశాతం రిజర్వేషన్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిందని, కానీ కొందరు పిటిషన్లు వేయడంతో పలు దఫాలుగా జరిగిన విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇటీవల ఆ జీవోను కొట్టివేసిందని వివరించారు. రాజ్యాంగం అమలులోకి రాకముందు నుంచే స్థానికంగా నివాసం ఉంటున్న ఎస్టీలకు స్థానికంగా ఉన్న పాఠశాలల్లో వందశాతం రిజర్వేషన్ అమలు అయ్యిందని తెలిపారు. సుప్రీం తాజా తీర్పుతో స్థానిక ఎస్టీలకు తీవ్రంగా నష్టపోయి, రిజర్వేషన్లు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఎస్టీల రిజర్వేషన్ కొనసాగించడం సముచితమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ర్టప్రభుత్వం పక్షాన రివ్యూ పిటీషన్ వేస్తామని సీఎం స్పష్టం చేశారు.

Advertisement

Next Story