యాపిల్ తర్వాతి అతిపెద్ద బ్రాండ్‌ రిలయన్స్!

by Shyam |   ( Updated:2020-08-05 09:01:03.0  )
యాపిల్ తర్వాతి అతిపెద్ద బ్రాండ్‌ రిలయన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్-2020 జాబితాలో దేశీయ అతిపెద్ద వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన ఆయిల్-టు-టెలికాం సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచ టెక్ సంస్థ యాపిల్ తర్వాత రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఫ్యూచర్ బ్రాండ్ తన సూచీల జాబితాను బుధవారం విడుదల చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని అంశాల్లోనూ రాణించడంతో ఈఏడాది రెండో అతిపెద్ద బ్రాండ్‌గా నిలిచింది. భారత్‌లోని అత్యంత లాభదాయక సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి. గౌరవనీయమైన, నైతికత, వృద్ధి, వినూత్న ఉత్పత్తులు, విలువైన వినియోగదారుల సేవ, అత్యంత ముఖ్యంగా ప్రజలతో సంస్థకున్న బలమైన సంబంధాలు ఇలా అన్ని విభాగాల్లో మెరుగైన అంశాలతో ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

గ్లోబల్ బ్రాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ అయిన ఫ్యూచర్‌బ్రాండ్.. రిలయన్స్ సంస్థ ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉన్న కంపెనీగా మారిందని ప్రకటించింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇంధనం, పెట్రో కెమికల్స్, టెక్స్‌టైల్స్, సహజ వనరులు, రిటైల్, టెలికాం సహా అనేక రంగాల్లోనూ విస్తరించింది. గూగుల్, ఫేస్‌బుక్ లాంటి టెక్ దిగ్గజాలు ఈ సంస్థలో వాటాలను కొనుగోలు చేశాయి. ఈ కారణాలతోనే రిలయన్స్ సంస్థ అగ్రస్థానంలో నిలిచిందని ఫ్యూచర్ బ్రాండ్ వెల్లడించింది.

Advertisement

Next Story