ఏపీ తరహా ఇంటింటికీ రేష‌న్ పంపిణీ చేయాలి : కోమటిరెడ్డి

by Shyam |   ( Updated:2021-07-26 08:05:11.0  )
Komatireddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేష‌న్ కార్డులు ఇవ్వడంతో పాటు రేష‌న్ పంపిణీలో నూత‌న సంస్కర‌ణ‌లు తీసుకురావాల‌ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఒక్క రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నా తీసుకోవ‌డంలో ప్రజ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌న్నారు. 6 కిలోల బియ్యం తీసుకోవ‌డానికి రవాణాతో క‌లిపి రూ.20 వెచ్చించాల్సి వ‌స్తుంద‌ని వివ‌రించారు.

ఏపీలో చేప‌ట్టిన‌ ఇంటింటికీ రేష‌న్ బియ్యం పంపిణీ విజ‌య‌వంతమైందని తెలిపారు. దానిని మోడ‌ల్‌గా తీసుకుని తెలంగాణలోనూ ఇంటింటికీ రేష‌న్ స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. సివిల్ స‌ప్లై శాఖ వాలంటీర్లను నియ‌మించి రేష‌న్ స‌రుకులు పంపిణీ చేస్తే రేష‌న్ కార్డుదారుల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, అనర్హుల పేరుతో తొలగించడం సబబుకాదన్నారు. అదే విధంగా డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేయాలని, ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5లక్షలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed