‘నక్సల్స్‌’ను టార్గెట్ చేసిన వర్మ.. సిల్వర్ స్క్రీన్ పై ‘కొండా దంపతుల’ బయోపిక్

by Anukaran |   ( Updated:2021-09-26 22:13:44.0  )
‘నక్సల్స్‌’ను టార్గెట్ చేసిన వర్మ.. సిల్వర్ స్క్రీన్ పై ‘కొండా దంపతుల’ బయోపిక్
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఏది చేసినా సెన్సెషన్. తనదైన శైలిలో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తుంటారు. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన ఆయన.. ప్రస్తుతం హిట్ సినిమాలు ఏవీ పెద్దగా తీయకపోయిన ఏ డెరెక్టర్‌కు రాని పాపులారిటీని సంపాదించుకోవడంలో ఆయన మాత్రం ముందుంటారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ తన కొత్త మూవీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను యూట్యూబ్ ద్వారా ప్రకటించారు. ‘తాను పుట్టింది విజయవాడలో అని.. దీంతో అక్కడి రౌడీయిజం, ఆ తర్వాత రాయలసీమ ఫాక్షనిజం గురించి తనకు తెలుసునని.. కానీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి తనకు ఏమీ తెలియదంటూ వర్మ వాయిస్ ఓవర్‌తో విడుదలైన టీజర్ వైరల్ అవుతోంది.

1990లలో తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో నక్సల్స్ లీడర్స్ రామకృష్ణ అలియాస్ ఆర్కేతో కొండా మురళికి మధ్య గల సంబంధం, నాటి సాయుధ పోరాటంలో నక్సల్స్ ఎదుర్కొన్న పరిస్థితులు.. వారి ఇబ్బందులు, ఆర్కే ఎన్‌కౌంటర్ అనంతరం కొండా మురళి ఏం చేశారు, సురేఖతో పరిచయం, వివాహం వంటి అంశాలను సినిమాటిక్ రూపంలో తీసుకురానున్నట్టు ప్రకటించారు.

1980లలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, నాటి రక్తచరిత్రను కళ్లకుకట్టినట్టు చూపనున్నట్టు అందుకోసం కొండా మురళిని కలిసి అనుమతి కూడా పొందినట్టు చెప్పారు. ఈ సినిమాను యోయో టాకీస్ నిర్మించనున్నట్టు తెలిపారు.

చివరలో ‘విప్లవం అనేది ఎప్పటికీ ఆగదని.. దాని రూపు మార్చుకుంటుందని’వర్మ చెప్పిన డైలాగ్ నక్సల్స్ ఉనికి ఆధారంగా మరో సంచనానికి వర్మ ప్లాన్ చేసినట్టు చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలకు తెరలేపుతుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed