హైదరాబాద్ అతలాకుతలం

by Shyam |
హైదరాబాద్ అతలాకుతలం
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. రోడ్లు జలాశయాలను తలపించాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోయింది. చాలా చోట్ల విద్యుత్ కు అంతరాయం కలిగింది. జన జీవనం అస్తవ్యస్తం అయింది.

రెండు గంటలపాటు వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. ఎల్బీ నగర్ , నాగోల్, దిల్‌సుఖ్ నగర్,కొత్తపేట,అబిడ్స్,కోటి, నాంపల్లి , రెడ్ హిల్స్, చార్మినార్,మలక్ పేట, కాచిగూట, నారాయణ గూడ తదితర ప్రాంతాల్లో కాలనీలు జలమయ్యాయి.

ఇక బస్తీలల్లో వరద నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో, ఎక్కడ కొట్టుకు పోతామోనని ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోడ్లు దాటారు. పంజాగుట్ట చౌరస్తా వద్ద రోడ్డు రెండు వైపులా కోతలకు గురై
ప్రమాదకరంగా మారింది.

లోయర్ ట్యాంక్ బండ్ లోని ముషీరాబాద్ మండల తహశీల్దార్ కార్యాలయం పరిసరాల్లో మూడు భారీ చెట్లు విరిగిపడ్డాయి. ట్యాంక్ బండ్ పై నున్న చెట్టు పడిపోవడంతో రైలింగ్ విరిగిపోయింది. వైర్లు తెగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కాగా అసిఫ్ నగర్‌లో 7.1,ఖైరతాబాద్‌లో 5.5,జూబ్లీహిల్స్ లో 4.9,మెహదీపట్నం లో 3.4,కార్వాన్‌లో 3.3,బేగంపెట్ లో 1.7,గోశామహల్‌లో 1.3,సికింద్రాబాద్‌లో 1.1 సెంటిమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story