న్యాయం అమరావతి రైతుల పక్షాన్నే ఉంది: ఆర్ఆర్ఆర్

by srinivas |
న్యాయం అమరావతి రైతుల పక్షాన్నే ఉంది: ఆర్ఆర్ఆర్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో నూటికి నూరు శాతం న్యాయం అమరావతి రైతులపక్షాన్నే ఉందని వైఎస్ఆర్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని, శాసనసభకు గాని లేదని విభజన చట్టం ద్వారా అర్థమవుతోందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఏ క్యాపిటల్ (a capital), ది క్యాపిటల్ (the capital) అంటూ రాజధాని అంశంపై విభజన చట్టంలో పొందుపరిచారని ఆయన వివరించారు.

అంతే కాకుండా, రాజధాని కోసం కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే, ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయాలనుకుంటే ప్రజలే ఎన్నికల్లో రాజకీయ నేతలను పిచ్చివాళ్లను చేస్తారని, ప్రజలు చాలా తెలివైన వాళ్లని అన్నారు. నూటికి నూరు పాళ్లు న్యాయం అమరావతి రైతుల పక్షానే ఉందని స్పష్టం చేశారు. ఏపీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం న్యాయపరంగా సరికాదన్నది తన నిశ్చితాభిప్రాయం అని, ఒకవేళ రాజధానికి సంబంధించి విభజన చట్టంలోనే ఏదైనా మార్పు చేయాలనుకుంటే, మళ్లీ పార్లమెంటులోనే బిల్లు తీసుకురావాలని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇలాంటి న్యాయపరమైన సలహాలకు రాష్ట్ర ప్రభుత్వంలా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే సత్తా తనకు లేదని, కానీ తనకు న్యాయ నిపుణులతో ఉన్న స్నేహం వల్ల కొందరు దీనిపై ఇచ్చిన సలహాలను మీకు వివరిస్తున్నాను అంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలను కూడా ప్రతినిధులకు వివరించారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆ పత్రిక రాసిన కథనాలను కూడా రఘురామ తప్పుబట్టారు. కొందరు తనపై తీవ్ర అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేస్తున్నారని, న్యాయమూర్తులను సైతం అదే రకమైన భాషతో కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed