క్రికెట్‌లో ఇంత వివక్షా.. ఆసియన్లపై ఇన్ని అవమానాలా?

by Anukaran |   ( Updated:2021-06-09 09:41:02.0  )
Cricket
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ అంటే ఒక జెంటిల్మెన్ గేమ్ అని చెబుతుంటారు. ఫుట్‌బాల్, రగ్బీలాగా ఇది రాక్షస క్రీడ కాదని.. అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆడుతుంటారని అంటుంటారు. కానీ, ఈ జెంటిల్మెన్ గేమ్‌లో కూడా చీకటి కోణాలు ఉన్నాయని.. ఎదుటి మనిషిని రంగు, జాతి, ప్రాంతం, లింగం ఆధారంగా చులకనగా చూస్తుంటారని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. జాతి వివక్షత, లింగ వివక్షతే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన క్రికెటర్లు అంటే అంతులేని విద్వేషాన్ని వెల్లగక్కుతూ ఆటకు తీరని మచ్చను తీసుకొని వస్తున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ క్రికెటర్ ఓలీ రాబిన్‌సన్ 8 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్లు ఒక్కసారిగా వెలుగులోనికి రావడంతో వివక్షత మరోసారి చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ చరిత్ర చూసుకుంటే.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లే ఎక్కువగా ఇతరులపై ఇలాంటి వివక్షతో కూడుకున్న వ్యాఖ్యలు చేసినట్లు కనిస్తుంటుంది. పాకిస్తాన్, ఇండియా క్రికెటర్లతో పాటు తమ సొంత జట్టులోని నల్లజాతీయులపై చేసిన వ్యాఖ్యలు ఎన్నోసార్లు వివాదాలకు దారి తీశాయి.

ఆసియన్లే టార్గెట్..

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు అనేకసార్లు ఆసియా, కరేబియన్ దేశాలకు చెందిన క్రికెటర్లపై నోరు పారేసుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, ఇండియాకు చెందిన అనేకమంది క్రికెటర్లపై రంగు, భాషపై కామెంట్లు విసిరే వారు. ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలో ఉపఖండ దేశాలు ఉన్నాయనే కారణంతో ఇంకా ఆయా దేశాల క్రికెటర్లను బానిసలుగా చూస్తుంటారు. ఇండియాలో చాలామంది పెద్దలను, తెలియని వారిని సార్ అని పిలుస్తుంటారు. ఈ మాటను పట్టుకొని ఇంగ్లాండ్ క్రికెటర్లు జాస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్అనేక సార్లు భారత జట్టును ఎగతాళి చేస్తూ ట్వీట్లు పెట్టారు. వీరిద్దరికి జత కలుస్తూ న్యూజీలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ కూడా ‘సార్’ అంటూ ఎగతాళిగా ట్వీట్లు చేశాడు. ప్రతీ పదం వెనుక సార్ జోడిస్తూ వారు ముగ్గురూ ట్వీట్లు చేసుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ క్రికెటర్ల ఇంగ్లీష్‌ను కూడా ఎగతాళి చేస్తూ ఆస్ట్రేలియన్ ప్లేయర్లు పలుమార్లు కామెంట్లువిసిరారు. ఇక ఓలీ రాబిన్‌సన్ అయితే ఆసియా దేశాలకు చెందిన ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణంగా ట్వీట్లు పెట్టాడు. క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది కామనే. కానీ ఒక్కోసారి ఆ స్లెడ్జింగ్‌ను దాటేసి బ్లాకీ అనీ నీగ్రో అని పిలుస్తూ గేలి చేసేవాళ్లు. ముఖ్యంగా ఆసియా దేశాలకు చెందిన ఆటగాళ్లు భారీ స్కోర్ చేస్తుంటే వారి రంగును పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడేవారని సీనియర్ క్రికెట్ ఒకరు వెల్లడించారు.

ఐపీఎల్ వల్లే మనకు లొంగుతున్నారు : ఫారూక్ ఇంజనీర్

ఓలీ రాబిన్‌సన్ ఉదంతంతో వివక్షకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత దిగ్గజ క్రికెటర్ ఫారూక్ ఇంజనీర్ ఇదే విషయంపై పలు విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళితే.. నేను ఇండియా నుంచి వచ్చినట్లు గుసగుసలు ఆడుకునే వాళ్లు.. నా భాషను, ఇంగ్లీష్ యాసను చాలా ఎగతాళి చేసేవారని ఫారుఖ్ చెప్పారు. ఒకప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే ఏకంగా ‘బ్లడీ ఇండియన్స్’ అంటూ తీవ్రమైన పదజాలంతో భారత క్రికెటర్లను హేళన చేశాడు. జెఫ్రీ ఒక్కడే కాదు అలా చాలా మంది ఆ జట్టులో వివక్ష చూపించే వాళ్లు. కేవలం ఇంగ్లాండ్ వాళ్లే కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్లు కూడా ఇలా హీనంగా మాట్లాడే వారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చి ఆయా దేశాల క్రికెటర్ల నోర్లు మూతపడ్డాయి. లేకపోతే వాళ్ల మాటలు మనం ఇంకెన్ని పడాల్సి వచ్చేదో అని ఇంజనీర్ అన్నారు. ఐపీఎల్ వల్ల పాశ్చాత్య దేశ క్రికెటర్లు మన బూట్లు నాకుతున్నారు. ఇప్పటి క్రికెటర్లకు వాళ్లందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ అప్పట్లో వాళ్ల అసలు రంగేమిటో మాజీ క్రికెటర్లకే తెలుసు అని ఫారూక్ ఇంజనీర్ చెప్పారు. ఏదేమైనా ఇప్పటికీ నేరుగా అనుకపోయినా.. సోషల్ మీడియాలో వారి విద్వేషాన్ని వెళ్లగక్కతున్నారని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed