వీఆర్వోను బూతులు తిట్టిన ఎమ్మెల్యే..

by Anukaran |
వీఆర్వోను బూతులు తిట్టిన ఎమ్మెల్యే..
X

‘ఏమయ్యా శ్యామ్.. ఎక్కడున్నవ్..’
‘ఇంట్లనే ఉన్న..’
‘నేను ఎమ్మెల్యే వివేక్‌ను మాట్లాడుతున్న..’
‘సార్.. నమస్తే..’
‘ఏమయ్యా.. పిలిస్తే రావా.. మా ఆఫీసు నుంచి ఫోన్ చేస్తే ఎత్తవా? తొక్కుతా..’
మౌనం…..
‘ఇండ్లు ఎట్లా కూలుస్తవ్.. వాళ్లకు మీటర్లు ఉన్నయ్. తీసుకుపోతవా..?’
‘సార్.. మా తహసీల్దార్ చెప్పిండు.. చేసిన..’
‘ఎవడ్రా చెప్పింది (బూతు).. చెప్తే చేస్తవా..? వాళ్ల దగ్గర మీటర్లు ఉన్నయ్..
గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తమంటుంటే నువ్వు ఎవడ్రా..’
‘కొత్తగా కట్టిర్రు.. అందుకే చేసినం.. నా తప్పేముంది?’
‘రేపు ఆఫీసుకు రా తొక్కుతా..’

ఇలా.. ఓ వీఆర్వోపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తాజాగా ఫోన్లో వీరంగం సృష్టించారు. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియో రికార్డులో ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి బూతులు తిట్టి, ఉద్యోగిని బెదిరించినట్లు స్పష్టమవుతోంది. అధికారుల ఆదేశాలతో విధులు నిర్వహించినందుకు వీఆర్వో జి.శ్యాంకుమార్‌ను బెదిరించినట్లు రెవెన్యూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబరు 79 లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణలు చేపట్టారు. వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో ఈ అక్రమాలకు తెర తీశారు. అయితే స్థానిక తహసీల్దార్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది సహకారంతో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. దానికి ప్రతిఫలంగా సదరు రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే వివేకానంద పరుష పదజాలంతో దూషించారు. రద్దయిన వీఆర్వోలతో పనులు చేయించుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా పనులు అప్పగిస్తున్నారు. దీంట్లో భాగంగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కూడా స్థానిక వీఆర్వోలకు ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటన ఉద్యోగ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

ప్రభుత్వ భూముల రక్షణ ఎట్లా?

ఒక వైపు ప్రభుత్వ భూములు కాపాడమని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశిస్తుంటే, దానికి భిన్నంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రభుత్వ ఉద్యోగి అని చూడకుండా ఒక వీఆర్వోని, తహసీల్దార్ ను, రెవెన్యూశాఖ మొత్తాన్ని ఇలా అసభ్య పదజాలంతో దూషించడం సిగ్గుచేటుగా సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నా.. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. కాగా.. నిజాయితీగా విధులు నిర్వహించే వారికి ఇలాంటి బెదిరింపులు ఏమిటంటూ రెవెన్యూ సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఘటన కలెక్టర్ దృష్టికి వెళ్లిందని, తదుపరి కార్యాచరణ ప్రకటిద్దామని ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్నారు..

ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేస్తమంటుంది : ఎమ్మెల్యే కేపీ

ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేస్తమన్నది. అలాంటప్పుడు వీళ్లెవరు? నా దగ్గరికి 200 మంది వచ్చారు. మహిళలని కూడా చూడకుండా బయటకు వెళ్లగొట్టి కూల్చేశారు. వాళ్లకు కరెంటు మీటర్లు కూడా ఉన్నాయి. అంటే వాళ్లు అక్కడే ఉంటున్నట్లే కదా. జాయింట్ కలెక్టర్ మాట్లాడిన వాయిస్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ఇదేం పద్ధతి. ఆ వీఆర్వో అక్రమాలకు పాల్పడుతున్నాడు. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులను అడ్డం పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నాడు. వాళ్లందరూ నా దగ్గరకు వచ్చి బాధ పడ్డారు. అందుకే నేను అడిగాను.

Advertisement

Next Story

Most Viewed