ప్రశ్నార్థకంగా స్టూడెంట్స్ ఫ్యూచర్ ?

by Shyam |
ప్రశ్నార్థకంగా స్టూడెంట్స్ ఫ్యూచర్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ఎంట్రెన్స్ పరీక్షల కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎంట్రెన్స్‌ల్లో అర్హత సాధించినా విద్యార్హత పత్రాలు అందకపోవడంతో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరలేక స్టూడెంట్స్ సతమతమవుతున్నారు. ఇదేక్రమంలో టెక్నికల్ విద్యామండలి, యూనివర్సిటీల సమన్వయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అకడమిక్ ఇయర్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఎంసెట్‌లో అర్హత సాధించినా.. ఇంటర్‌లో 45శాతం మార్కులు లేని వారిని అనర్హులుగా నిర్ణయిస్తూ ఎంసెట్ కన్వీనర్ ఫలితాలను ప్రకటించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కరోనా నేపథ్యంలో పరీక్షలకు హాజరైన అందరినీ పాస్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటికే కౌన్సెలింగ్‌లో ర్యాంకులు కేటాయించడంతో విద్యార్థులు నష్టపోయారు. ఆ తర్వాత కరోనా పాజిటివ్, వ్యక్తిగత కారణాలతో పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ప్రత్యేక పరిస్థితుల్లో 35శాతం మార్కులతో పాసైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఈ విషయం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు తెలియకపోవడంతో చాలా నష్టపోయారు.

ప్రస్తుతం ఓయూ డిగ్రీ విద్యార్థులకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నడుస్తుండగానే ఈనెల 2న ఐసెట్, 6న లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. వీటికి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. అటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లోనూ పరీక్షలకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ రాకపోవడంతో ఐసెట్, లాసెట్‌లో అర్హత సాధించిన వారు నష్టపోతున్నారు. ఈ విషయాలపై విద్యార్థుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతుండటంతో కొందరు యూనివర్సిటీ అధికారులు కౌన్సెలింగ్‌తో తమకు సంబంధం లేదని చెప్పుతుండటం గమనార్హం.

Advertisement

Next Story