Oxygen Cylinder: మార్కెట్లోకి ‘ఆక్సిజన్ సిలండర్ సెటప్ గైడ్’ యాప్

by Shyam |   ( Updated:2021-05-24 02:24:33.0  )
Oxygen cylinder
X

దిశ, ఫీచర్స్: కొవిడ్‌తో సీవియర్‌గా బాధపడుతున్న పేషెంట్లకు మెడికల్ ఆక్సిజన్ అవసరమవుతుంది. అయితే హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి కూడా అత్యవసర వేళల్లో ‘ఆక్సిజన్ సిలిండర్’ పెట్టాల్సి రావొచ్చు. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్‌ను ఇంట్లోనే సెట్ చేసి వారికి ప్రాణవాయువు అందించొచ్చు. అయితే దాన్ని ఇన్‌స్టాల్ చేయడం కాస్త కష్టమైనా పనే. ఈ నేపథ్యంలో ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో లభించే ‘ఆక్సిజన్ సిలిండర్ సెటప్ గైడ్’ యాప్‌ను పుణే కేంద్రంగా పనిచేస్తున్న డిజైన్‌టెక్ అనే ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ సంస్థ అభివృద్ధి చేసింది.

కొవిడ్ మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని, ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే హోం ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులతో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా పల్స్ ఆక్సిమీటర్ సాయంతో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయిల్ని, పల్స్ రేట్, టెంపరేచర్ చెక్ చేసుకోవాలని వైద్యలు చెబుతున్నారు. ఒకవేళ SPO స్థాయి, 90-92 కంటే దిగువ స్థాయికి పడిపోయినప్పుడు మాత్రం వైద్యుడిని సంప్రదించి ఆక్సిజన్ సిలిండర్‌తో శ్వాస అందించాలని తెలిపారు. అయితే ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ సిలండర్ దొరక్కపోవడం సమస్య కాదు. కానీ ఆక్సిజన్ సిలిండర్‌‌ను సరైన మార్గంలో ఇన్‌స్టాల్ చేసి ఏర్పాటు చేయడమే పెద్ద సమస్య. ఈ తరహా అనుభవాన్ని ఫేస్ చేసిన ‘డిజైన్‌టెక్ సిస్టమ్స్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్వాహా దీనికి పరిష్కారంగా ‘ఆక్సిజన్ సిలిండర్ సెటప్ గైడ్’ రూపొందించాడు. ఈ యాప్ సాయంతో ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేయడం సులభతరం అవుతుంది. అగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో ఆక్సిజన్ సిలిండర్ ఇన్‌స్టాలేషన్ ఫిజికల్‌గా మనముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది.

‘రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిచోటా వినియోగిస్తారని ఆశిస్తున్నాను. అత్యవసర సమయంలో ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్‌ను అమర్చి ఫ్లోమీటర్‌ను కనెక్ట్ చేయడం, ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో మరికొన్ని మోడల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ యాప్‌ను రూపొందించడానికి పది మంది సభ్యులం శ్రమించాం. ఐదు లీటర్ల సామర్థ్యంతో పాటు, ఆపై ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌ ఇన్‌స్టాలేషన్‌లో ఈ యాప్ పనిచేస్తుంది’. – మార్వాహా, డిజైన్‌టెక్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్

Advertisement

Next Story

Most Viewed