’వైసీపీని ఢీకొట్టడం ఒక్క జనసేనకే సాధ్యం‘

by srinivas |
’వైసీపీని ఢీకొట్టడం ఒక్క జనసేనకే సాధ్యం‘
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలలో జనసేన పార్టీ బలోపేతం చెందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల లక్ష్మీదుర్గేశ్ అన్నారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరుగుతూ వస్తోందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైసీపీని ఢీ కొట్టడం ఒక్క జనసేనకే సాధ్యమన్నారు. ప్రజలు జనసేన పార్టీని ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడుతోందని..రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రతీ ఇంటికి తీసుకెళ్తామని అందుకు తగ్గ కార్యచరణను పార్టీ నాయకత్వం రూపొందిస్తోందని వెల్లడించారు. మరోవైపు ఇటీవల జరిగిన మూడు ఎన్నికలలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా జనసేన, టీడీపీలు సహకరించుకున్నాయన్నారు. ఇరు పార్టీలు కలిసి ఉభయగోదావరి జిల్లాలలో పలు ఎంపీపీ స్థానాలను దక్కించుకున్నట్లు వెల్లడించారు. ఇక టీడీపీతో పొత్తుపై పార్టీలో ఇంకా చర్చకు రాలేదన్నారు. టీడీపీకి చెందిన కీలక నేతలు జనసేనతో పొత్తుపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అయితే ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌దే తుది నిర్ణయమన్నారు. ఇకపై జనసేన పార్టీ ప్రజల్లోనే ఉంటుందని కందుల లక్ష్మీ దుర్గేశ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story