బ్రేకింగ్.. ఎమ్మెల్సీ వాణీదేవీకి చేదు అనుభవం

by Anukaran |   ( Updated:2021-09-17 02:29:47.0  )
TRS MLC candidate Surabhi Vani Devi
X

దిశ, శేరిలింగంపల్లి : అధికారిక కార్యక్రమాలు నిర్వహించే సందర్భాల్లో విధిగా ప్రోటోకాల్ నిర్వహించడం ఆనవాయితీ. కానీ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం ప్రోటోకాల్ వ్యవహారాన్ని అధికారులు తుంగలో తొక్కారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనల్లో సైతం కొందరు ప్రజాప్రతినిధుల పేర్లను శిలాఫలకాల మీద రాయలేకపోతున్నారు.

తాజాగా రాయదుర్గంలోని లెదర్ ఇన్స్‌స్టిట్యూట్‌లో నూతనంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం శుక్రవారం హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, ఎమ్మెల్సీ వాణీదేవీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, వాణీదేవీ పేరు మాత్రం శిలాఫలకం మీద లేకపోగా.. మిగతా ఎమ్మెల్సీలైన పట్నం మహేందర్ రెడ్డి, కట్టెపల్లి జనార్దన్ రెడ్డి, గోరేటి వెంకన్న పేర్లు మాత్రం ఉన్నాయి.

ఇదే విషయంపై ఎమ్మెల్సీ సురభీ వాణీదేవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరు శిలాఫలకంపై లేకపోవడం పట్ల అక్కడే ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె అధికారులను వివరణ కోరారు. వెంటనే శిలాఫలకాన్ని మార్చి సురభీ వాణీదేవీ పేరు చేర్చి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇలా ప్రోటోకాల్ పాటించకుండా.. ప్రజాప్రతినిధుల పేర్లు లేకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేయడం, కార్యక్రమాలకు సంబంధం లేని వారి పేర్లను చేర్చడం పట్ల తరచూ టీఆర్‌ఎస్ పార్టీలో చర్చసాగుతూనే ఉంది.

Advertisement

Next Story

Most Viewed