- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెదక్‌లో ఏకగ్రీవానికి నో ఛాన్స్.. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్స్
దిశ ప్రతినిధి, మెదక్: మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈనెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి ఏడుగురు 13 సెట్ల నామినేషన్స్ దాఖలు చేసినట్టు మెదక్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం నామినేషన్స్ దాఖలు చేసింది. అదేవిధంగా అధికార పార్టీకి ధీటుగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్స్ సమర్పించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవానికి చెక్ పడింది. కాగా, బీజేపీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది.
ఏడుగురు.. 13 సెట్ల నామినేషన్స్ దాఖలు
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి ఏడుగురు 13 సెట్ల నామినేషన్స్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుండి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్స్ వేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్స్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుండి గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన వంటేరు యాదవరెడ్డి, మంత్రి హరీష్ రావు, జిల్లా ఎమ్మెల్యేలు, సిద్దిపేట, సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్స్ వేలేటి రోజాశర్మ, మంజుశ్రీ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, కాంగ్రెస్ నుండి సంగారెడ్డికి చెందిన నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, తిరుపతి రెడ్డి, ఆంజనేయులుతో రెండు సెట్లు నామినేషన్స్ దాఖలు చేశారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థులుగా పటాన్ చెరుకు చెందిన ప్రవీణ్ కుమార్ రెండు సెట్లు, సంగారెడ్డికి చెందిన బోయిని విజయలక్ష్మి రెండు సెట్లు, గజ్వేల్‌కి చెందిన చింతల సాయిబాబా ఒక సెట్, దుబ్బాకకు చెందిన మట్ట మల్లారెడ్డి రెండు సెట్లు చొప్పున నామినేషన్స్ దాఖలు చేశారు. కాగా, వీరి నామినేషన్ల పరీశీలన నేడు ఉండనుంది. ఉపసంహరణకు ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉండగా, డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది.
ఏకగ్రీవానికి నో ఛాన్స్..!
మెదక్ ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమయ్యేలా కన్పించడం లేదు. మెజార్టీ ఓటర్లు అధికార టీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్నప్పటికీ పోలింగ్ నిర్వహించక తప్పేలా కన్పించడం లేదు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ బరిలో నిలవడమే. దీనికితోడు అధికార టీఆర్ఎస్‌కి ధీటుగా అదే పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిదులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీంతో ఎన్నిక అనివార్యమైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌కి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. తమ నిరసనను తెలియజేసేందుకు పలువురు టీఆర్ఎస్‌కి చెందిన ప్రజాప్రతినిధులు బరిలో నిలిచారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో వారిని పోటీ నుండి తప్పుకోవాలంటూ అధికార టీఆర్ఎస్ బుజ్జగింపుల పర్వం మొదలెట్టినట్టు సమాచారం.
ఎన్నికకు దూరంగా బీజేపీ
మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలో బరిలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతుండగా బీజేపీ ఈ ఎన్నికు దూరంగా ఉంది. నామినేషన్లు ముగిసే సమయానికి బీజేపీ పార్టీ నుండి ఒక్కరూ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ఎన్నికల్లో గెలుపొందేందుకు తగిన బలం లేనందునే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ ముఖ్య నేతలను సంప్రదించగా, మొదట్లో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా బీజేపీ కుడా బరిలో ఉందామని ఆలోచన చేసిందని, చివరకు ఎన్నికల్లో నిలబడి ఓడిపోవడం కంటే పోటీ నుండి తప్పుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి అధిష్టానం వచ్చిందని బీజేపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీలో నిలబడి తమ పార్టీ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైంది. సీఎం ఇలాఖలో అధికార టీఆర్ఎస్‌కి చుక్కలు చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా నామినేషన్ల విత్ డ్రా ముగిసే సమయానికి ఎంతమంది బరిలో ఉంటారనేది తెలవాలంటే ఈనెల 26 వరకు వేచి చూడాల్సిందే.