- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ప్రైవేటు వ్యాక్సిన్.. మే 1 నుంచి సబ్సిడీపై టీకా
దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో కరోనా వ్యాక్సిన్ ప్రైవేటు మార్కెట్‌లోకి రానుంది. అయితే ధర ఎంత ఉంటుందనేదానిపై ఇప్పటికి స్పష్టత లేదు. కానీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వమే ధరను ఖరారు చేయనుంది. 18 ఏళ్ళ వయసు నిండినవారంతా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని ప్రధాని మోడీ ప్రకటించినందున వారికి ఉచితంగా ఇచ్చే అవకాశం లేదని వైద్యారోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రధాని మోడీ తాజా ప్రకటనతో రాష్ట్రంలో సుమారు 2.62 కోట్ల మంది 18 ఏళ్ళ వయసు నిండినవారు వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కలిగింది. కానీ ఇంతమందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించడం కష్టమేనని, ప్రైవేటులోకి వ్యాక్సిన్ పంపిణీ వస్తున్నందున త్వరలో ధరలు ఖరారయ్యే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తున్నప్పటికీ మే నెల 1వ తేదీ నుంచి ప్రైవేటు మార్కెట్‌లోనూ అందుబాటులోకి వస్తున్నందున డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందేనని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ కోసం రూ. 150, సర్వీసు ఛార్జి పేరుతో అదనంగా రూ. 100 చొప్పున చెల్లిస్తున్న ప్రజలు ఇకపైన కూడా ఇదే తీరులో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపి ప్రైవేటు వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తాయని, ప్రజలకు ఆర్థిక భారం లేకుండా సబ్సిడీ ధరల్లో లభ్యమయ్యేలా చూసే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విధి విధానాలను ఖరారు చేస్తుందని, ప్రజల ఆర్థిక స్థాయిని దృష్టిలో పెట్టుకుని సబ్సిడీని ఖరారు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. ఆయా ఆదాయవర్గాలకు అనుగుణంగా ఈ ధర ఖరారవుతుందని తెలిపారు. పేదలకు ఒక రకం ధర, మధ్యతరగతి వర్గాలకు మరో రకం ధర, సంపన్నులకు ఇంకో ధర.. ఇలా వేర్వేరు ధరలు ఉంటాయని, తక్కువ ధర ఉండే వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఊరట కల్పిస్తుందని తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్ళ వయసువారంతా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నెల చివరికల్లా విధి విధానాలను ఖరారు చేయవచ్చని తెలిపారు.
ప్రధాని మోడీ తాజా నిర్ణయంతో 2.62 కోట్ల మందికీ ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలు మొత్తం ఉత్పత్తిలో సగం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాయని, మిగిలిన సగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు మార్కెట్‌కు ఇస్తాయని వివరించారు. అయితే ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నట్లుగా రూ. 150లకే ఒక డోస్ ఇస్తాయా లేక ధరను పెంచుతాయా అనేది త్వరలో తేలుతుందని, దానికి అనుగుణంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆచరణ సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తాయని తెలిపారు.
ఆరు నెలల్లో పూర్తి చేయాలి
వ్యాక్సినేషన్ ప్రక్రియను రానున్న ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా సప్లయ్ కూడా జరగాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పుడున్న విధంగానే అరకొర సప్లయ్ ఉంటే ఏడాది కాలమైనా పట్టే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అదే జరిగితే నవంబరు-డిసెంబరు మాసాల్లో వచ్చే థర్డ్ వేవ్ కాస్త సీరియస్‌గానే ఉంటుందన్నారు. ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో, ఉన్న సెకండ్ వేవ్ వైరస్ ‘బి-1617‘గా శాస్త్రవేత్తలు నిర్వచించారని తెలిపారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న వ్యాక్సిన్ ఈ రకం స్ట్రెయిన్‌ను అరికడుతుందా లేదా అనేది ఇంకా చర్చనీయాంశంగానే ఉందన్నారు. కానీ థర్డ్ వేవ్ వచ్చే సమయానికి దాదాపు మూడింట రెండు వంతుల జనాభాకు వ్యాక్సిన్ అందినట్లయితే కొత్త స్ట్రెయిన్‌ను తట్టుకోవడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు.