ప్రైవేట్ టీచర్లను వెంటనే ఆదుకోవాలి

by Shyam |
ప్రైవేట్ టీచర్లను వెంటనే ఆదుకోవాలి
X

దిశ, ముషీరాబాద్: తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆకలి కేకల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రైవేట్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, టిపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు మహాధర్నాకు హాజరై మద్దతు పలికారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ… కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడి తొమ్మిది నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను వెంటనే ఆదుకోవాలన్నారు. ఉపాధి కోల్పోయి వేతనాలు లేక అనేకమంది పలు రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని, ఎవరిని ఆదుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 54 శాతం మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్నారని అన్నారు. ప్రైవేట్ టీచర్ల సమస్యలు చట్టసభల్లో ఎందుకు చర్చించరని, వారు తెలంగాణ ప్రజలు కాదా అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు.

Advertisement

Next Story