ఆసుపత్రులు వెలవెల

by Shyam |
ఆసుపత్రులు వెలవెల
X

దిశ, మెదక్: కరోనా ఎఫెక్ట్ ఆసుపత్రులపై తీవ్రంగా పడింది. లాక్‌డౌన్‌కు ముందు రద్దీగా ఉన్న హాస్పిటళ్లు, ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. దీంతో చిన్నా, పెద్దా ఆసుపత్రులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లాక్ డౌన్ తరువాత కూడా ఈ కష్టాలు తప్పవంటున్నారు డాక్టర్లు. చిన్న హాస్పిటల్ ను నడపాలంటే నెలకు రూ .2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వైద్య పరికరాలపై పెట్టుబడులు, సిబ్బంది వేతనాలు, బ్యాంక్ రుణాలు గుదిబండలా మారాయని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఓపీ సేవలు అందించేందుకు సిబ్బంది జంకుతున్నారు. ఓపీ సేవలు ప్రారంభిస్తే కరోనా తమకు సోకే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇందు కోసం డాక్టర్లు, పీపీఏలు, మాస్క్ లు వేసుకుని రోగులను పరీక్షించాలంటే ఖర్చుతో కూడిన అంశం. ఒక్కో పీపీఏ ఖరీదు రూ .1900, ఎన్ .19 మాస్క్ లు ధరించి, ఆసుపత్రిలో 10 మంది సిబ్బంది ఉంటే రోజుకు రూ . 20 వేలు చొప్పున అదనపు భారం పడుతుంది.

10 మంది సిబ్బందితో..

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియంత్రణలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ప్రభుత్వ, ఇతర ప్రత్యేక మహిళా – శిశు, ఇతర ముఖ్య మైన విభాగాలతో ప్రభుత్వ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. అలాగే జిల్లాలో 10 మంది సిబ్బందితో నడిచే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 500 వరకు ఉండగా, 10 మంది నుంచి 20 మంది సిబ్బందితో నడిచే ఆసుపత్రులు 100 వరకు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల మేర టర్నోవర్ చేసే వైద్యరంగం లాక్‌డౌన్ సమయంలో సమస్యలతో విలవిలలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గి, సామాన్య పరిస్థితులు నెలకొనే వరకు తమపై ఆర్థిక భారం పడకుండా బ్యాంకులు తమ ఈఎంఐలపై మారిటోరియాన్ని మరికొన్ని నెలలపాటు పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed