హైదరాబాద్‌ రైతును ప్రశంసించిన ప్రధాని మోడీ

by Anukaran |
PM Modi, Chintala Venkat Reddy
X

న్యూఢిల్లీ: అతిప్రాచీన భాషల్లో ఒకటైన తమిళం నేర్చుకోనందుకు తరుచూ బాధపడుతుంటారని, ఆ భాషలో అద్భుత సాహిత్యం వెలువడిందని తనకు చాలా మంది చెప్పారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యమంత్రిగా లేదా ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మోడీ ఏ విషయంలోనైనా పశ్చాత్తాపపడ్డారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రపంచంలోనే అతిప్రాచీన భాషల్లో ఒకటైన తమిళం నేర్చుకోనందుకు బాధపడుతుంటారని వివరించారు. తమిళం అందమైన భాష అని, ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించిందని తెలిపారు. తమిళ భాషలోని విలువైన సాహిత్యం గురించి చాలా మంది తనతో మాట్లాడారని చెప్పారు. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో చాలా మంది నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నారని వివరించారు. నీటిని సంరక్షించడం పౌరులందరి బాధ్యత అని తెలిపారు.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనుందని తెలిపారు. ‘వాన నీటిని ఒడిసిపట్టుకోండి’ పేరుతో 100 రోజుల క్యాంపెయిన్‌నూ త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కజిరంగ నేషనల్ పార్క్‌లో 112 కొత్త జాతుల పక్షులు కనిపించాయని, దీనికి కారణం అక్కడ ఉండే నీటి నిల్వలు, మానవ జోక్యం స్వల్పంగా ఉండటమేనని వివరించారు. నేషనల్ సైన్స్‌డే ప్రస్తావిస్తూ స్వయం సమృద్ధ భారత్ సాధనలో శాస్త్రవిజ్ఞానం అమోఘపాత్ర నిర్వహించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ప్రసిద్ధ శాస్త్రవేత్త సర్ సివి రామన్ పరిశోధనలకు ఆ రోజును అంకితం చేస్తున్నట్టు వివరించారు. భారత యువత దేశానికి చెందిన శాస్త్రవేత్తల గురించి, భారత విజ్ఞాన చరిత్రనూ చదవాలని సూచించారు. సైన్స్ ల్యాబ్ నుండి ల్యాండ్‌పైకి రావలసి ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన రైతు చింతల వెంకటరెడ్డిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఇప్పుడు సాధారణ పౌరుల గుండెచప్పుడుగా మారిందని, వారు అసాధారణ పనులు చేస్తున్నారని వివరించారు. పరీక్షల సమయం సమీపిస్తున్నదని, విద్యార్థులు ఆందోళనపడవద్దని అన్నారు. తన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలో సరికొత్త సూత్రాలను పొందుపరిచారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed