ఇంకో మూడు రోజులు సీల్డ్​ కవర్​లోనే!

by Shyam |
ఇంకో మూడు రోజులు సీల్డ్​ కవర్​లోనే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదిక మరో మూడు రోజులు సీల్డ్​ కవర్​లోనే ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 4న ఉన్నతాధికారుల త్రిసభ్య కమిటీ భేటీ ఉంటుందని భావించారు. కానీ కమిటీలో ఒకరైన జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్​ కుమార్​కు సమయం కుదరడం లేదంటూ చెప్పుతున్నట్లు సమాచారం. ముగ్గురు అధికారులు భేటీ అయిన తర్వాతనే పీఆర్సీ ఇచ్చిన నివేదికను ఓపెన్​ చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రమే నివేదిక సీఎస్​కు ఇచ్చారు. అయితే శుక్రవారం సెలవు కావడంతో శనివారం… ఉన్నతాధికారుల భేటీ ఉంటుందని భావించారు.

కానీ కొత్త సంవత్సర వేడుకలు, శుభాకాంక్షల పరిస్థితుల్లో అధికారులకు వీలు కుదరలేదు. ఇదే సమయంలో ఉద్యోగుల జేఏసీ కూడా శనివారం సీఎస్​ను కలుస్తారనుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కలుస్తామని జేఏసీ అధ్యక్షుడు రాజేందర్​ వెల్లడించారు. కానీ సోమవారం కూడా సీఎస్​ను కలిసి నివేదిక తీసుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. అధికారుల కమిటీ భేటీ అయి, అధ్యయనం చేసిన తర్వాతనే నివేదికను జేఏసీకి ఇవ్వనున్నారు. కానీ సోమవారం అధికారుల సమయం వీలుకావడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇంకో మూడు రోజుల పాటు పీఆర్సీ నివేదిక సీల్డ్​ కవర్​కే పరిమితం కానుంది.

పీఆర్సీ నివేదికపై అటు ఉద్యోగ సంఘాల్లో రోజు రోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఫిట్​మెంట్​పై విభిన్నస్థాయిల్లో ప్రచారం జరుగుతున్నా… ఎక్కడా క్లారిటీ రావడం లేదు. వాస్తవంగా వేతన సవరణ కమిషన్​ సూచించిన ప్రకారం కంటే ఎక్కువగానే పీఆర్సీ వస్తుందని ఆశిస్తున్నారు. అయితే కమిషన్​ ఎంత మేరకు సూచించిందనే విషయం తేలడం లేదు. అటు అధికారులు కూడా నోరెత్తడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఎక్కడా లీక్​ కావడం లేదు. అదే విధంగా ఉన్నతాధికారుల త్రిసభ్య కమిటీ భేటీ అనంతరం సీఎం కేసీఆర్​ను కలిసి పీఆర్సీ నివేదికపై వివరిస్తారని కూడా చెప్పుతున్నారు. సీఎంను కలిసి చర్చించిన తర్వాతనే నివేదికను బయటకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే వేతన సవరణ కమిషన్​ నివేదిక సీఎం కేసీఆర్​ నోటీసులో ఉందని కూడా చెప్పుతున్నారు. ఈ పరిస్థితుల్లో పీఆర్సీ ఫిట్​మెంట్​పై ఇంకో మూడు రోజుల పాటు ఉత్కంఠ కొనసాగనుంది.

Advertisement

Next Story

Most Viewed