సోనియా సంచలన నిర్ణయం.. ప్రశాంత్ కిశోర్‌కు కీలక పదవి.!

by Anukaran |   ( Updated:2021-07-29 21:42:29.0  )
sonia-gandhi
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)కు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ఇటీవల వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించే లక్ష్యంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకేకు ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలోనే పీకేకు పార్టీలో కీలక పదవిని అప్పగించాలని కాంగ్రెస్ ​అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల రాహుల్‌ గాంధీ సీనియర్‌ నాయకులైన కె.సి.వేణుగోపాల్‌, ఆనంద్‌ శర్మ, కమల్‌నాథ్‌, మల్లికార్జున ఖర్గే, ఎ.కె.ఆంటోనీ, అజయ్‌ మాకెన్‌, అంబికా సోని, హరీష్‌ రావత్‌లతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి పీకే వస్తే పార్టీకి కలిగే లాభనష్టాలపై బేరీజు వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ కిశోర్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకునే ముందు సీనియర్లతో చర్చించాలని రాహుల్‌కు తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.

అయితే, బీజేపీని ఓడించడానికి ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన కొన్ని సూచనలపై కాంగ్రెస్‌లోని సీనియర్లు కూడా అంగీకారం తెలిపినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపాలంటే కాంగ్రెస్ పార్టీ సొంతంగా కనీసం 136 సీట్లను గెలుచుకోవాలని.. ఈ క్రమంలో ఇతర పార్టీలతో జత కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పీకే సూచించారు.

అయితే, విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదని ఆయన వివరించారు. బీజేపీని ఓడించడం కోసం అన్ని పార్టీలు ఏకం కావడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌, సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ తదితరులతో భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో ఇప్పటికే సీనియర్ నేతలు ఉన్న కారణంగా పీకేకు సోనియా ఏ పదవి ఇస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed