డిజిటల్ చెల్లింపులు పెరిగినా నోట్లకు తగ్గని డిమాండ్!

by Harish |
digital payment
X

దిశ, వెబ్‌డెస్క్: డీమోనిటైజేషన్(నోట్ల రద్దు) నిర్ణయం అమలై ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఇన్నేళ్లలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో కరెన్సీ నోట్ల చలామణి కూడా క్రమంగా పెరిగాయని ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత చాలామంది నగదు రహిత చెల్లింపులకు మారినప్పటికీ, కరెన్సీ నోట్ల వినియోగం కూడా పుంజుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత చాలామంది ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు డబ్బును దగ్గరే ఉంచుకున్నారు. ఈ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ చలామణి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

డెబిట్, క్రెడిట్ కార్డుల దగ్గరి నుంచి నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, పేమెంట్స్ యాప్ చెల్లింపులు అత్యధికంగా పెరిగాయి. వీటిలో ప్రజలెక్కువగా యూపీఐ చెల్లింపులనే వాడుతుండటం గమనార్హం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2020, నవంబర్‌లో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ. 26.88 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ. 29.17 లక్షల కోట్లకు పెరిగాయి. గడిచిన ఏడాది కాలంలో చెలామణిలో ఉన్న నోట్ల విలువ రూ. 2.28 లక్షల కోట్లు పెరిగాయి. సంఖ్యా పరంగా.. చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 16.8 శాతం పెరిగాయి. విలువ పరంగా ఈ పెరుగుదల 7.2 శాతం అధికం. యూపీఈ లావాదేవీలు ప్రతి నెలా రికార్డు స్థాయిలో వృద్ధి సాధిస్తున్నాయి. అక్టోబర్ నెలలో గణాంకాల ప్రకారం.. మొత్తం 421 కోట్ల లావాదేవీలు జరగ్గా, విలువ పరంగా ఇది రూ. 7.71 లక్షల కోట్లుగా ఉంది.

Advertisement

Next Story