- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిష్కారమే లేదా.. అసలు ఈ సమస్యకు కారణం ఎవరూ..?
భూమి పెరిగింది. అవును నిజమే. అధికారులు తలచుకుంటే పెరగదా? ఎంత భూమి ఉంటే ఏమిటి? రికార్డుల్లో ఎడాపెడా రాసేశారు. ఈ క్రమంలో అసలైన పేదల పేర్లు గల్లంతయ్యాయి. వారంతా ఏండ్ల తరబడి తమకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రియల్టర్ల డబ్బు, దర్పం ముందు బీద రైతుల మొర ఎవ్వరికీ వినిపించడం లేదు. వారి బాధలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆఖరికి సీఎం సారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కూడా వారి సమస్యలను పరిష్కరించలేకపోయింది. ఇది తట్టుకోలేని బక్క రైతులు ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధ పడుతున్నారు.
దిశ, న్యూస్ బ్యూరో: ఎన్నో సంవత్సరాలుగా వారు దున్నుకుంటున్న భూమి ఇప్పుడు వారిది కాదంటున్నారు. మూడేండ్లుగా పట్టాదారు పుస్తకాలు జారీ చేయకుండా వివాదాస్పద భూములుగా మార్చివేశారు. తిరిగి తిరిగి వేసారిన బీద రైతులు బతుకు మీదనే విరక్తిని పెంచుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. పాలకుల నిర్లక్ష్యానికి ఓ దళిత రైతు నిండు ప్రాణం బలైంది. తన సమస్య పరిష్కారం కాకపోవడంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన ఓ దళిత రైతు అంతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. వారసత్వంగా వచ్చిన భూమి తనది కాదంటున్నారనే మనో వేదనతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సమస్య ఒక్క అంతయ్యది మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అసైన్డ్ రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ సిబ్బంది ఉన్న భూమి కంటే ఎక్కువగా పట్టాలు జారీ చేయడమే ఇందుకు కారణం. గత రెండు దశాబ్దాలుగా భూ పంపిణీ చేశామంటూ హద్దులు లేకుండానే పట్టాలు జారీ చేసి పాలకులు చేతులు దులిపేసుకున్నారు. ‘మీరూ మీరూ కొట్టుకు చావండంటూ’ వదిలేశారు. ఫలితంగా గ్రామాల్లో రాజకీయ క్రీడ నడిచింది. ఎక్కడపడితే అక్కడ వివాదాలు పుట్టుకొచ్చాయి. రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ, యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అసైన్ఢ్ భూములు పొందిన రైతులు ఎందరో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
నాయకుల మాయాజాలమే
భూ వివాదాలకు కారణం ముమ్మాటికీ నాయకులే. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందో, లేదో చూడకుండానే ఎవరి హయాంలో వారు పట్టాల జారీకి ఉత్సాహం చూపారు. అధికారులు కూడా ఖాళీ భూముల లెక్క ప్రజాప్రతినిధులకు చెప్పలేదు. ఉన్న భూమి కంటే రెట్టింపుగా పట్టాలు జారీ చేశారు. సాగు చేసుకుంటున్న రైతుల కంటే, చేతిలో పట్టాలు పెట్టుకొని తిరుగుతున్నవారే అధికం. ఒక్కొక్కరికీ పది గుంటల నుంచి పదెకరాల వరకు పంపిణీ చేశారు. చాలా వరకు హద్దులు లేవు. ఉజ్జాయింపు కొలతలతోనే సాగు చేసుకుంటున్నారు. ఎక్కువ భూములు రాళ్లు రప్పలతో నిండి ఉన్నాయి. పట్టాలతోనే సంతృప్తి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక గ్రామాలలో ఇదే తంతు కొనసాగింది.
లెక్క ఇలా తేలింది
భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో అసలు లెక్క బయట పడింది. ఉన్నదాని కంటే, జారీ చేసిన పట్టాల్లోనే భూమి ఎక్కువగా ఉందని రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. దాంతో సదరు భూములన్నింటినీ పార్టు ‘బి’ కింద పేర్కొన్నారు. వీటిని వివాదాస్పదంగా పేర్కొంటూ కొత్త పాస్ పుస్తకాల విడుదలను నిలిపివేశారు. దీంతో పాపం పేద రైతులు మూడేండ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారు ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటున్నారు. సమస్యకు పరిష్కారం దొరికితేనే పట్టాదారు పుస్తకాలు వస్తాయని తహశీల్దార్లు చెబుతున్నారు. ఇందుకు కారణం ఎవ్వరో మాత్రం ప్రభుత్వానికి చెప్పడం లేదు. ఆ కాలంలో పని చేసిన వీఆర్వోలు, తహశీల్దార్లు, ప్రజాప్రతినిధులే దోషులన్న విషయం అందరికీ తెలుసు. భూముల ధరలు రూ. వేల నుంచి రూ. లక్షలకు పెరిగిపోవడంతో పరిష్కారం కూడా సుదూరమైంది. ఇటు రైతులు రైతుబంధు, రైతు బీమా, పంట రుణాల వంటి పథకాలకు దూరమవుతున్నారు. దీనికి తోడు పక్కనే రియల్టర్లు భూములు కొనుగోలు చేయడం, వీరి హక్కులను ప్రశ్నిస్తుండడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. తుదకు నిస్సహాయులుగా మారుతున్నారు.
పరిష్కారం ప్రభుత్వమే చూపాలి
అసలు కంటే ఎక్కువకు పట్టాలు జారీ చేసినప్పుడు ఏం చేయాలి? ఎవరి పట్టా పాసు పుస్తకం నుంచి తొలగించాలి? ఎవరికి ఎప్పుడు కేటాయించారు? సర్వే ఎలా చేయాలి? ఎవరికి ఎలా సరిహద్దులు ఏర్పాటు చేయాలి? మొదటి నుంచి సాగు చేస్తున్న రైతుల నుంచి ఎలా తొలగించాలి? ఇవేవీ సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలాయి. ఈ క్రమంలోనే అంతయ్య మాదిరిగా అనేక మంది రైతులు బాధ పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పాలకులు, అధికారుల తప్పిదాలే!
– రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెనలో సర్వే నంబరు 242లో 142 ఎకరాల భూమి ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వానిదే. పేద రైతులకు అసైన్ చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న భూమి 142 ఎకరాలైతే, పట్టాలు మాత్రం 199 ఎకరాలకు జారీ చేశారు. అంటే 57 ఎకరాల భూమి లేకపోయినా పట్టాలు ఇచ్చారు.
– యాదాద్రి జిల్లా ఆలేరులోనూ పలువురు దళిత రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు.
– నల్లగొండ జిల్లా నాంపల్లిలోనూ పలువురు అసైన్ఢ్ రైతులకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడంలేదు. కనీసం రికార్డులనూ పరిశీలించడం లేదు.
– రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలు కలిసి అసలుకు మూడింతలు భూమిని పెంచేశారు. అనేక మందికి విక్రయించారు. విక్రయిస్తూనే ఉన్నారు. ‘గత’ రిజిస్ట్రేషన్ విధానంలో ఉన్న లోపాలను ఇందుకు వినియోగించుకున్నారు. అంతా అసలు పట్టాదారులకు సంబంధం లేకుండానే సాగిపోవడం విశేషం.
– ఖాస్రా పహాణీకి, నేటి పహాణీలు, సేల్‌డీడ్స్‌లోని విస్తీర్ణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
– రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి (ఆవాస గ్రామం నీలిపోచమ్మతండ)లో ఐదు సర్వే నంబర్లలోని అసలు భూమి కంటే మూడున్నర రెట్లు అమ్మకానికి గురైనట్లు తెలిసింది. సర్వే నంబర్లు 356, 358, 359, 360, 361లలో మొత్తం విస్తీర్ణం 64 ఎకరాలు. కానీ, 60కి పైగా సాగిన సేల్‌డీడ్ల లెక్క చూస్తే 291 ఎకరాలుగా నమోదైంది. ఇందులో కొందరికి మ్యుటేషన్ చేశారు. చాలా మంది దగ్గర సేల్‌డీడ్లు మాత్రమే ఉన్నాయి. పహాణీల్లో నమోదు కాలేదు. వారు కొనుగోలు చేసిన భూమి ఎక్కడుందో వారికే తెలియదు. దాంతో చాలా మంది మ్యుటేషన్‌కు దరఖాస్తు కూడా చేసుకోలేదని తెలుస్తోంది.