దుబ్బాక‌లో హీటెక్కిన పాలిటిక్స్‌

by Anukaran |
దుబ్బాక‌లో హీటెక్కిన పాలిటిక్స్‌
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉపఎన్నికల్లో రాజకీయం వేడేక్కింది. చేరిక‌ల ప‌ర్వం జోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తికావడంతో ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతున్నారు. నిన్నమొన్నటివరకు టీఆర్ఎస్ పార్టీ బీజేపీనే టార్గెట్ చేసి ప్రచారం సాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సైతం టార్గెట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావును ప్రకటించారు. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్‌కు షాకిచ్చారు. ఈ ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవ ఎన్నిక అని ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 30 ఏండ్ల పాటు ప్రజల కోసం బతికిన చెరుకు ముత్యంరెడ్డికి టీఆర్ఎస్ అవమానాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చిందని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డినే ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మొత్తంగా ఇతర పార్టీల నేతల చేరికలతో ప్రచారంలో రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి.

టీఆర్ఎస్ అసంతృప్తుల‌ను దృష్టిలో పెట్టుకొని..

టీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తామని ఎక్కడా ప్రకటించకుండానే అసం‌తృప్తులను మొదట్లో సంతోషపరిచింది. టీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ వస్తున్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా బరిలో తాను ఉంటానంటూ ప్రచారం సాగించాడు. ఇటు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం, మరో వైపు దివంగతనేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తమతమ ప్రయత్నాలను సాగించారు. గ్రామాల్లో పర్యటించి, టీఆర్ఎస్ పార్టీ నుంచి తనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం సాగించారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా తమ దరఖాస్తులను కూడా అందజేశారు. చివరకు రామలింగారెడ్డి భార్య సుజాత పేరును అధికారికంగా ప్రకటించటంతో, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని పిలుపు రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసింది.

నాయ‌కులంద‌రూ దుబ్బాక‌లోనే..

ప్ర‌ధాన పార్టీల నాయ‌కులంద‌రూ దుబ్బాకలోనే క‌నిపిస్తున్నారు. తమ అభ్యర్థిని గెలుపునకు ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీహెచ్, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతోంది. బీజేపీ తరఫున మాజీ మంత్రి డీకే అరుణ ఇప్పటికే చేగుంటలో ప్రచారం నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నీ తానై మంత్రి హరీశ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి దుబ్బాక‌లో ఆయా పార్టీల క్యాడర్ తారుమారవుతున్నది. నిన్న మొన్న ఓ పార్టీ కండువాతో ప్రచారం చేసిన నాయకులు నేడు వేరే పార్టీల కండువాతో ప్రచారంలో కనపడుతున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed