బీఆర్ఎస్‌కు ఝలక్: కాంగ్రెస్ నేత మల్లుతో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి భేటీ

by Kalyani |   ( Updated:2023-06-10 13:49:52.0  )
బీఆర్ఎస్‌కు ఝలక్: కాంగ్రెస్ నేత మల్లుతో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి భేటీ
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చేలా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవితో శనివారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన దామోదర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలలో తనకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆగ్రహించి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండవసారి ఎమ్మెల్సీగా దామోదర్ రెడ్డి ఎంపికయ్యారు.

నాగర్ కర్నూల్ లో దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మధ్య అధిపత్య పోరు సాగడం.. దామోదర్ రెడ్డి మాట చెల్లుబాటు కాకపోవడం.. తన వర్గీయులపై కేసులు నమోదు కావడంతో పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాను పదవిలో ఉన్నాను తప్ప.. ఎటువంటి అధికారాలు ఉండడం లేదని ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోయింది.

దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కొంత కాలం నుంచి దామోదర్ రెడ్డి తన కుమారుడైన రాజేష్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయించే ఆలోచన చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేక పోవడం, ఎమ్మెల్యేతో పొసగకపోవడంతో దామోదర్ రెడ్డి తన కుమారుడితో కలిసి సొంత గూడు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి అనుగుణంగా దామోదర్ రెడ్డి మల్లు రవితో భేటి కావడం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed