- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో మళ్లీ పాదయాత్రలు షురూ
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పాదయాత్రలకు తెలుగు రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా పాదయాత్రలకు దిగుతున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి మొదలైన రాజకీయ పాదయాత్రలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. ప్రజా సమస్యలు తెలుసుకోవడం పేరిట గతంలో నేతలు చేపట్టిన పాదయాత్రల తరువాత వారికి అధికారం దక్కిన దాఖలాలున్నాయి. కేవలం పాదయాత్రలతోనే అధికారాన్ని అందుకున్నారా అనేది పక్కనపెడితే అవి కూడా వారి విజయాల్లో పాత్ర పోషించాయనడంలో మాత్రం సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు నేతలు పాదయాత్రలకు దిగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్పార్టీ యాత్రల్లో నిమగ్నమైంది. త్వరలో షర్మిల కూడా ఇదే యాత్ర చేయనున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ సొంత నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తిరుగులేని ‘ముద్రలు’
ఉమ్మడి ఏపీలో రాజశేఖర్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్రతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. 2003లో చేపట్టిన ఈ యాత్ర ముగిసిన తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు పాదయాత్రల ఫలాలపై నేతల్లో నమ్మకం పెరిగిపోయింది. ఆ తర్వాత ఉద్యమ నేతగా కేసీఆర్ ఆర్డీఎస్‌పై ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేశారు. అదే ఆయనకు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని అప్పగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుతం ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించడంతో ప్రజలు మరో సుదీర్ఘ పాదయాత్రను చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. 2012 అక్టోబర్ 2న వస్తున్నా.. మీకోసం అంటూ చంద్రబాబు నాయుడు 2,340 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత విభజిత ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోన్ రెడ్డి ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. జగన్ సోదరి షర్మిల 2012 అక్టోబరు 18న ప్రారంభించి 2013 జులై 29 వరకు 230 రోజుల పాటు సుమారు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఆ తర్వాత తెలంగాణలో 2016-17లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సహా మరికొందరు నాయకులు కూడా సుమారు 4 వేల కిలోమీటర్ల మేర మహాజన పాదయాత్ర చేశారు.
తెలంగాణలో మళ్లీ మొదలు
తెలంగాణలో పాదయాత్రలు మళ్లీ మొదలయ్యాయి. నిరుద్యోగం, రైతు సమస్యలపై కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు. నాయకులు భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్రలకు అంకురార్పణ చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి అచ్చంపేట నుంచి యాత్రను మొదలుపెట్టారు. సీఎల్పీ నేత భట్టి యాత్ర మంగళవారం ఆదిలాబాద్ జిల్లా భీంసరి నుంచి ప్రారంభించారు. అగ్రి చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సదాశివపేట నుంచి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేయనున్నట్టు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కొత్త పార్టీ ప్రకటించిన షర్మిల కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నేతలు సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి పాదయాత్ర చేశారు. రాబోయే రోజుల్లో స్థానికంగా పట్టు సాధించేందుకు గులాబీ నేతలు పాదయాత్రలు చేయాలని భావిస్తున్నారు.