‘పండక్కి ఊరెళ్తున్నారా.. మాకు చెప్పండి’

by Anukaran |
‘పండక్కి ఊరెళ్తున్నారా.. మాకు చెప్పండి’
X

దిశ, క్రైమ్ బ్యూరో: సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా.. అయితే, ఈ విషయం మీ కోసమే. తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊరెళ్లే ముందు మీ నగలు, నగదును భద్రపర్చుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ పోలీసులు గుర్తు చేస్తున్నారు. కచ్చితంగా మీ పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని, లేదంటే.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. దొంగల బారిన పడకుండా మీ ఇంటిపై ఓ నిఘా వేస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నగరం నుంచి లక్షలాది మంది ప్రజలు గ్రామాలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించేందుకు నగర పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనుమానితులు కన్పిస్తే డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

నగలు, నగదు జర భద్రం..

సాధారణంగా తాళాలు వేసిన ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తుంటారు. మనం ఊరెళ్లినా, డ్యూటీకి వెళ్లినా ఇంటికి తాళం వేయడం తప్పనిసరి. కానీ, దొంగలు ఎంతటి తాళాలనైనా ఇట్టే బ్రేక్ చేయగల నేర్పరులు ఉన్నందున కచ్చితంగా సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటున్నారు పోలీసులు. ఇంట్లో ఉండే విలువైన వస్తువులు, ముఖ్యంగా నగలు, నగదును తెలిసిన వారి వద్ద గానీ, బ్యాంక్ లాకర్ లోనో భద్రపర్చుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా, కచ్చితంగా మీరు ఊరెళ్తున్న విషయాన్ని మీ పక్కింటి వారికి, స్థానిక పోలీస్ స్టేషన్‌లలో సమాచారం ఇవ్వాలంటున్నారు. ప్రస్తుతం అసలే కరోనా పరిస్థితులు కావడంతో క్రైమ్ రేట్ గతం కంటే అధికంగా పెరుగుతున్నట్టు పోలీసు శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇల్లు వదిలి రోజుల తరబడి ఇల్లు వదిలి ఊరెళ్లే వారు మరిన్న జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా దాదాపు నగరం నుంచి లక్షలాది మంది గ్రామాలకు వెళ్లే విషయం మనకు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు ప్రత్యేక ప్రచారాన్ని చేపడుతున్నారు. సంక్రాంతి పండుగను సంతోషంగా గడిపేందుకు పోలీస్ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేస్తున్నారు.

రోజుకు రెండుసార్లు చెక్ చేసుకోండి : పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ నాగయ్య

సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారు తప్పనిసరిగా తమకు ముందుగా సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి ఇండ్లను రోజుకు రెండు సార్లు తనిఖీ చేస్తాం. ఏకాంతంగా ఉండి దొంగ తనాలకు అవకాశం ఉండే ఇండ్ల వారు సమాచారం ఇవ్వండి. మీరు సమాచారం ఇస్తే దొంగతనాలు జరగకుండా రోజుకు రెండు సార్లు క్రమం తప్పకుండా చెక్ చేస్తాం. ఈ సంవత్సరం ప్రాపర్టీ క్రైమ్ ఫ్రీ ఇయర్‌గా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. బస్తీల ప్రజలతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు వారి వాచ్ మెన్‌లతో వచ్చి పోయే వారి వివరాలను నమోదు చేయాలని చెప్పండి. అనుమానితులపై డయల్ 100 కు ఫిర్యాదు చేయాలి.

Advertisement

Next Story