కరోనా నివారణకు ప్లాస్మా థెరపీ?

by sudharani |   ( Updated:2020-03-29 04:19:51.0  )
కరోనా నివారణకు ప్లాస్మా థెరపీ?
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో ప్రబలిన ఫ్లూ, మీజిల్స్, పోలియో, చికెన్ పాక్స్, సార్స్, ఎబోలా వ్యాధులకు ఉపయోగించిన ప్లాస్మా థెరపీని కరోనా (కొవిడ్-19) చికిత్స కోసం వినియోగించడానికి న్యూయార్క్ డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అక్కడి మాంటేపియోరే మెడికల్ సెంటర్ వైద్యులు మొదటిసారిగా ప్లాస్మా థెరపీ ద్వారా కొవిడ్ నయం చేసే పరిశోధనలు మొదలుపెట్టారు.

ఈ థెరపీ కోసం ఇప్పటికే కొవిడ్ బారిన పడి పూర్తిగా నయమైన పేషెంట్లు అవసరం. వీరి రక్తం నమూనాలు సేకరించి ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా వేరు చేసి వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. వైరస్ ప్రతిరక్షకాల నుంచి రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా వ్యాక్సిన్ తయారు చేసే పనితో పోలిస్తే ఇలా కాన్వలెసెంట్ ప్లాస్మా ద్వారా వ్యాక్సిన్ తయారు చేయడం చాలా సులభం. అయితే ఇప్పుడు పూర్తిగా కొవిడ్ నుంచి రికవరీ అయిన పేషెంట్లను గుర్తించడమే పెద్ద సమస్య.

ఈ వైరస్ గురించి పెద్ద ఎత్తున పరిశోధనలు అందుబాటులో లేకపోవడంతో ఒక వ్యాధిగ్రస్తుడు పూర్తిగా కోలుకున్నాడా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించడం చాలా కష్టం. ఒకవేళ పైకి పూర్తిగా కోలుకున్నట్లు కనిపించినప్పటికీ రక్తంలో వైరస్ నిద్రావస్థలో ఉంటే ప్లాస్మా థెరపీ చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. అయితే ఈ అంశం గురించి పరిశోధనలు చేసేందుకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఓ ప్రాజెక్టును రూపొందిస్తోంది. నేషనల్ కొవిడ్ 19 కాన్వలెసెంట్ ప్లాస్మా ప్రాజెక్టు పేరుతో ప్రపంచంలో ఉత్తమ వైరాలజిస్టులు, ఇమ్యునాలజిస్టులను ఏకం చేస్తున్నారు. ఈ దిశగా పరిశోధనలు చేపడుతున్న మొదటి రాష్ట్రం న్యూయార్క్ అవుతుంది. కొవిడ్ మరణాల్లో అమెరికా, చైనాను దాటేసిన సంగతి తెలిసిందే. అందుకే వ్యాధి వ్యాప్తి మరింత పెరగకముందే ఏదో ఒక ఫలితాన్ని చూపించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ ప్లాస్మా థెరపీ విజయవంతమైతే ఒక్కరి ప్లాస్మా ద్వారా మూడు నుంచి నలుగురు పేషెంట్లను ట్రీట్ చేసే అవకాశం కలుగుతుంది.

Tags : CORONA, COVID 19, Plasma therapy, donor, new york, johns hopkins

Advertisement

Next Story