- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దూకుడు పెంచిన ఫైర్ బ్రాండ్ రోజా.. అదే జరిగితే ‘చంద్రబాబు’కు చుక్కలే.!
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ఆమెకంటూ ఓ గుర్తింపు ఉంది. ప్రత్యర్థి ఎవరైనా తనదైన శైలిలో విరుచుకుపడటంలో ఆమెకు ఆమె సాటి. అసెంబ్లీలో ఆమె మాట్లాడటం స్టార్ట్ చేస్తే విపక్షాలకు ముచ్చెమటలు పట్టాల్సిందే. నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆమె జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయమని ఆమెతోపాటు రాష్ట్ర ప్రజలంతా భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దూరమైంది.
దీంతో ఎమ్మెల్యే రోజా కాస్త స్పీడు తగ్గించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరుచుకుపడే రోజా ఆ తర్వాత నెమ్మదించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా కనీసం వైసీపీ నుంచి ధీటుగా స్పందించే మహిళా ఎమ్మెల్యేలు కరువయ్యారు. దీంతో వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రోజా రంగంలోకి దిగారు. వైఎస్ జగన్‌పై విరుచుకుపడేవారికి తన విమర్శలతో చుక్కలు చూపించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌పైనా.. దివంగత సీఎం వైఎస్ఆర్‌పైనా తెలంగాణ మంత్రులు, నేతలు విమర్శలు చేస్తుంటే ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు.
మంత్రులకు దీటుగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ మంత్రులు, ఇతర నేతలు విమర్శించడం మెుదలు పెట్టారు. దీంతో రోజా మళ్లీ దూకుడు పెంచారని ఆమె అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భావించారు. గతంలో మంత్రి పదవి చివరి నిమిషంలో మిస్ అయినా ఈసారి మాత్రం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే రోజాకు నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ శత్రువులు సైతం పెరుగుతుండటం ఇబ్బందికరంగా మారింది.
ప్రతిపక్షంలో తీవ్ర ఇబ్బందులు..
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. వైఎస్ జగన్ కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా ఆమె పార్టీని వీడలేదు. 2014, 2019 ఎన్నికల్లో కీలక నేతలను ఓడించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. టీడీపీ హయాంలో ఎమ్మెల్యే రోజా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో పరాభవాలను చూశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీ సస్పెన్షన్‌కు గురయ్యారు.
తనపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి ఆమె మీడియాలో కంటతడి సైతం పెట్టారు. అయినప్పటికీ ఆమె వెనక్కితగ్గలేదు. తెలుగుదేశం పార్టీపైనా..జనసేన పార్టీపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమని భావించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఐదేళ్లు పడ్డ కష్టానికి ఈసారి ఫలితం దక్కుతుందని అంతా భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ మంత్రి పదవి చేజారిపోయింది.
తలనొప్పిగా మారిన ఇంటిపోరు..
ఎమ్మెల్యే రోజాకు ఇంటిపోరు పెద్ద సమస్యగా మారింది. సొంత పార్టీ నేతలే ఆమెపై అసమ్మతిరాగం వినిపిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎమ్మెల్యే రోజాకు పొసగడం లేదని ప్రచారం ఉంది. 2019 ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండగా నిలుస్తున్నారని ఆమె పరోక్షంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు క్యాబినెట్‌లో మంత్రి పదవి రాకపోవడానికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డియే కారణమని ప్రచారం కూడా జరిగింది.
తాజాగా నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా వైసీపీలో అందరికీ పదవులు దక్కితే రోజాకు ఉన్న పదవికాస్త ఊడిపోయింది. ఇదిలా ఉంటే తనపై అసమ్మతిరాగం వినిపిస్తున్న రెడ్డివారి చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమించడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి సహకరిస్తున్నారంటూ రోజా తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిలపై రోజా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ పంచాయతీ సీఎం జగన్ దృష్టి వరకు వెళ్లింది. రెడ్డివారి చక్రపాణిరెడ్డికి నామినేటెడ్ పదవి దక్కడంతో రోజా ఆలోచనలో పడ్డారు. తనకు సొంతపార్టీలో వ్యతిరేక కూటమి రెడీ అవుతుందేమోనని ఆమె భావించారు. మరోవైపు రాజకీయంగా రోజా సైలెంట్ అయ్యారన్న ప్రచారానికి చెక్‌పెట్టేందుకు.. అసమ్మతిని దీటుగా ఎదుర్కొనేందుకు రోజా వ్యూహరచన చేశారు.
అలర్ట్ అయిన రోజా..
నగరి నియోజకవర్గంలో తనకు రాజకీయ ప్రత్యర్థులు సొంతపార్టీ నుంచే పెరుగుతుండటంతో రోజా అలర్ట్ అయ్యారు. వాస్తవానికి రెడ్డివారి చక్రపాణి రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. చక్రపాణిరెడ్డి పెదనాన్న రెడ్డివారి చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. దీంతో నగరి నియోజకవర్గంలో ఆ కుటుంబానికి గట్టి పట్టు ఉంది. రెడ్డివారి చెంగారెడ్డి అభ్యర్థన మేరకే చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఆలయ చైర్మన్ పదవి దక్కిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈ పరిణామాలు స్థానిక ఎమ్మెల్యే గా ఉన్న రోజాకు ఇబ్బందికరంగా మారింది. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా లోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండాలని భావించారు. భర్తతో కలిసి నిత్యం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే దూకుడుగా వ్యవహరించారో అంతే దీటుగా రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంలో సీఎం జగన్, దివంగత సీఎం వైఎస్ఆర్‌లపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు. ఇంత జరుగుతున్న కనీసం మంత్రులు కూడా స్పందించలేదు. రోజా మాత్రం ఊరుకోలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులకు దీటుగా సమాధానం ఇచ్చారు. అప్పుడు సహకరిస్తామని ఇప్పుడు నిరాకరిస్తారా అంటూ కేసీఆర్‌ను రోజా ప్రశ్నించారు. ఆ తర్వాత రాష్ట్రమంత్రులు, సలహాదారులు స్పందించారు.
రోజాకు తగ్గిన పోటీ..
ఇకపోతే మరో ఐదు నెలల్లో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. సుమారు 80-90శాతం మంత్రివర్గాన్ని జగన్ మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి తీసుకోబోయే కేబినెట్ ఎలక్షన్ కేబినెట్ కావడంతో ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మంచిదని కూడా పలువురు సీఎం జగన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం రెండున్నరేళ్లకే ఎలక్షన్ రానుంది. ఈ నేపథ్యంలో విపక్షాలు కూడా దూకుడు పెంచే అవకాశం ఉంది.
ఇప్పటికే విపక్షాలు వైసీపీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దీంతో విపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే అది రోజాతోనే సాధ్యమని వైసీపీలోని కొందరు పెద్దలు భావిస్తున్నారట. వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నుంచి వంగలపూడి అనిత, భూమా అఖిలప్రియ, గుమ్మడి సంధ్యారాణి, గౌతు శిరీష, పరిటాల సునీత, పంచుమర్తి అనురాధ, ఆదిరెడ్డి భవానీలు బీజేపీ నుంచి యామినిలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మలు ఘాటుగా కౌంటర్ ఇచ్చేవారు. అయితే వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గా ఉండటంతో ఆమె విమర్శలు చేయడం లేదు.
దీంతో ఇకనైనా రోజాను ఉపయోగించుకుంటే మంచిదని భావిస్తున్నారు. అలాగే రోజా గతంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళల సానుభూతి పార్టీకి దగ్గరవ్వడంలో కీలక పాత్ర పోషించిందని అది మళ్లీ వర్కౌట్ అవుతుందని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. అలాగే గతంలో చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పదవికి భారీ పోటీ ఉండేది. అయితే ఈసారి ఆ పోటీ తక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు కాస్త తగ్గారని తెలుస్తోంది.
రోజాకు మంత్రి పదవి తన వల్లే దక్కడం లేదన్న అపఖ్యాతిని తాను మూటగట్టుకునేదానికంటే సైలెంట్ అవ్వడమే మేలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి కేబినెట్‌లో రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది.