పైలట్‌కు ఊరట.. ఆ నోటీసులపై ఇప్పుడే చర్యలొద్దు: రాజస్థాన్ కోర్టు

by Shamantha N |
పైలట్‌కు ఊరట.. ఆ నోటీసులపై ఇప్పుడే చర్యలొద్దు: రాజస్థాన్ కోర్టు
X

న్యూఢిల్లీ: సచిన్ పైలట్ శిబిరానికి రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం వరకు ఊరటనిచ్చింది. అనర్హత నోటీసులపై తదుపరి విచారణ జరిగే శుక్రవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ను ఆదేశించింది. పార్టీ విప్ ఉల్లంఘించిన సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని రాజస్థాన్ సర్కారు అభ్యర్థించగా ఈ నోటీసులను రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు తర్వాతే తదుపరి ప్రణాళికను అమలులో పెట్టాలని భావించిన గెహ్లాట్ సర్కారు మంగళవారం హడావిడిగా మరోసారి శాసనసభాపక్ష భేటీని నిర్వహించింది. ఫెయిర్‌మొంట్ హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, రాష్ట్ర యూనిట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోవింద్ సింగ్ దొతసరాలూ హాజరయ్యారు. మరికొన్ని రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండాలని సూచనలు చేసినట్టు తెలిసింది. పైలట్ తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఇది మూడో శాసనసభాపక్ష భేటీ కావడం గమనార్హం. డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్‌ను తొలగించిన తర్వాత తొలిసారిగా సీఎం తన నివాసంలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ కట్టడి చర్యలు సహా పలు అంశాలపై చర్చించినట్టు చెబుతున్నా, ఫ్లోర్ టెస్టుకు సంబంధించిన విషయాలనూ మాట్లాడినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన వెంటనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి బలనిరూపణ చేయాలని సీఎం గెహ్లాట్ భావిస్తున్నట్టు వివరించాయి. మెజార్టీ మార్క్‌కు మించి బలాన్ని సమకూర్చుకున్నట్టు తెలిపాయి.

గెహ్లాట్‌కు బలముంది.. కానీ?

ఈ నేపథ్యంలోనే బలాలపై చర్చ జరుగుతున్నది. గెహ్లాట్ సర్కారు తమకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని చెబుతున్నారు. మెజార్టీ మార్కు 101. అంటే మెజార్టీ తమ వద్ద ఉన్నదని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు నిజంగానే కింగ్ మేకర్‌లుగా కనిపిస్తున్నారు. హైకోర్టు ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ అవకాశం కల్పిస్తే, వారు ప్రతిపక్షంవైపునకు నిలబడితే సర్కారుకు గట్టిపోటీ ఎదురుకానుంది. పైలట్ టీంలోని 19 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన 72 మంది ఎమ్మెల్యేలతోపాటు చిన్నపార్టీలు, స్వతంత్రులూ ఇటే మొగ్గితే ప్రతిపక్షం బలం 97కు చేరనుంది. మెజార్టీ మార్క్‌కు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువ ఉండటంతో సర్కారుకు టఫ్ ఫైట్ ఎదురుకానుంది.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో రూ.1.25 కోట్లు స్వాధీనం

రాజస్థాన్ సర్కారును కూల్చే కుట్రలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన కేసులో ఉదయ్‌పూర్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1.25కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ) తెలిపింది. గతవారం సంజయ్ జైన్ సహా మరో ఇద్దరు అశోక్ సింగ్, భరత్ మలానీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు దళారులని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సహా ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.100కోట్లు సంజయ్ జైన్‌కు అందినట్టు ఎస్‌వోజీకి చెందిన ఓ అధికారి పేర్కొనడం గమనార్హం. అయితే, జైన్ లాంటి వాళ్లు క్షేత్రస్థాయిలో పనిచేసేవారని పెద్ద తలకాయలు ఇంకా బయటకు రాలేదని మరో అధికారి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed